నాలుగు నెలల్లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ సేవలు
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్టమొదటి నీటిలో తేలియాడే హోటల్ (ఫ్లోటింగ్ రెస్టారెంట్) ఏర్పాటుచేసిన ఘనత ముంబైకే దక్కింది. దీన్ని బుధవారం బాంద్రాలో సముద్ర తీరం వద్ద పర్యాటక శాఖ మంత్రి ఛగన్ భుజ్బల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ హోటల్ పర్యాటకులకు ఆగస్టు 15 లేదా సెప్టెంబర్ నుంచి సేవలందించే అవకాశాలున్నాయని భుజబల్ చెప్పారు. సుమారు రూ.102 కోట్లతో నిర్మితమైన ఈ ఆధునిక రెస్టారెంట్ ప్రతీ రోజు ముంబైకి వచ్చే వేలాది దేశ, విదేశ పర్యాటకులకు మరింత ఆకర్షణగా నిలవనుంది.
మహారాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఎంటీడీసీ) చొరవ తీసుకోవడంవల్ల డబ్ల్యూబీ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, ఎ.బి.హాస్పిటాలిటీ సహకారంతో ఇది కార్యరూపం దాల్చింది. బాంద్రా-వర్లీ సీ లింక్ మార్గంలో మేరి టైం బోర్డు ఏర్పాటుచేసిన జెట్టి (ప్లాట్ఫారం) వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఈ రెస్టారెంట్లోకి వెళ్లేందుకు వీలుంటుంది.
ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రత్యేకతలు
మూడంతస్తులున్న ఈ రెస్టారెంట్ అమెరికాలో తయారైంది.
360 డిగ్రీల వరకు బాంద్రా-వర్లీ సీ లింక్ వంతెనతోపాటు ముంబై అందాలను తిలకించవచ్చు.
లగ్జరీ డైనింగ్ ప్ల్లాట్తోపాటు స్కైడెక్ ఉంది.
24 గంటలూ ఇందులో టీ, కాఫీతోపాటు ఇతర తినుబండారాలు లభిస్తాయి.
వేర్వేరు అంతస్తుల్లో ఉన్న రెస్టారెంట్లలో ఒకేసారి 660 మంది కూర్చుని భోజనం, అల్పాహారాన్ని ఆస్వాదించవచ్చు.
ఇది సముద్రంలో నిలిచి ఉన్నప్పటికీ ఎలాంటి పడవలు, స్టీమర్ల సాయం లేకుండా నేరుగా జెట్టి ద్వారా అందులోకి ప్రవేశించవచ్చు.