రూ.48 కోట్లతో పుష్కరాల పనులు
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు
ప్రకాశంనగర్ (రాజమండ్రి) : గోదావరి పుష్కరాల సందర్భంగా విద్యుత్ శాఖలో రూ.48 కోట్లతో పనులు చేస్తున్నట్టు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు వెల్లడించారు. పుష్కరాల పనులపై తమ శాఖకు చెందిన ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో ఆయన రాజమండ్రి ఎస్ఈ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ.30 కోట్లతో, పశ్చిమగోదావరిలో రూ.18 కోట్లతో పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరిలో 5, పశ్చిమ గోదావరిలో 6 కొత్త సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు.
పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా 33 కేవీ లైన్ల ఇంటర్ లింక్, 11 కేవీ, ఎల్టీ లైన్లను పూర్తిగా మారుస్తామన్నారు. పుష్కరాల పనులకు ఇన్చార్జిగా లక్ష్మీనారాయణ (హెచ్ఆర్) వ్యవహరిస్తారన్నారు. ఇద్దరు సీజీఎంలు ఆయనకు సహాయకులుగా ఉంటారని, ఈ ముగ్గురూ ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్ఈ గంగాధర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఈ టీవీ సూర్యప్రకాశ్, డీఈ శ్యామ్‌బాబు, ఏడీఈ సామ్యూల్ పాల్గొన్నారు.