చైర్మన్, సీఈఓ పదవులకు ఐటీసీ దేవేశ్వర్ గుడ్ బై!
యువ నాయకత్వం కోసమేనని వెల్లడి
న్యూఢిల్లీ: ఐటీసీ చైర్మన్ వై.సి. దేవేశ్వర్ తన ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ పదవుల నుంచి వైదొలగనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఆయన పదవీ కాలం ముగియనున్నది. ఈ పదవుల్లో ఆయన 20 ఏళ్ల పాటు కొనసాగారు. ఈ పదవుల నుంచి వైదొలగిన అనంతరం ఆయనను నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, చైర్మన్‌గా నియమించనున్నామని ఐటీసీ తెలిపింది. వచ్చే నెల 22న జరిగే కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో మూడేళ్ల ఈ నియామకానికి వాటాదారుల ఆమోదం కోరతామని పేర్కొంది.
సిగరెట్ కంపెనీ స్థాయి నుంచి..
కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాల పరంగా అగ్రనాయకత్వంలో యువరక్తం ఉంటే బావుంటుందని దేవేశ్వర్ భావిస్తున్నారని, అందుకు ఎగ్జిక్యూటివ్ రోల్ నుంచి వైదొలగాలనుకుంటున్నారని, వాటాదారులకు పంపిన నోటీస్‌లో ఐటీసీ పేర్కొంది. 1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్(69) 1996లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2012లో చైర్మన్‌గా మళ్లీ నియమితులయ్యారు. ఆయన చైర్మన్‌గా పగ్గాలు చేపట్టినప్పుడు ఐటీసీ వార్షిక ఆదాయం రూ.5,200 కోట్లు, స్థూల లాభం రూ.452 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆదాయం పదింతలై రూ.51,582 కోట్లకు, స్థూల లాభం 33 రెట్లు పెరిగి రూ.14,958 కోట్లకు పెరిగాయి.