chaitanya ratham
-
టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు
సాక్షి, విజయవాడ: అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు వెళ్లారు. అంతేకాదు టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ మంగళవారం నోటీసులు కూడా అందించారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న.. వార్తా కథనాలపై సీఐడీ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆ పత్రిక ఎడిటర్, నిర్వహణ ఎవరంటూ సీఐడీ ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి లాయర్ చేతికి నోటీసులు అందించారు సీఐడీ అధికారులు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై చైతన్య రథం ప్రతిక తప్పుడు కథనాలు ప్రచురించింది. ఎన్నికల కమిషన్‌కి బుగ్గన సమర్పించిన అఫిడవిట్లో స్థిర, చర ఆస్తులపైనా తప్పుడు రాతలు రాసింది. దీంతో ఆయన పత్రికపై ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది సీఐడీ. -
అంతిమయాత్ర కోసం చైతన్యరథం..?
నందమూరి హరికృష్ణ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పదం ‘చైతన్యరథం’.. దీనికి, హరికృష్ణకి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ‘చైతన్యరథం’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఆ ‘చైతన్యరథం’పైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. అయితే ఆ చైతన్యరథానికి రథసారథి హరికృష్ణ. తండ్రి కోసం ‘సీతయ్య’ డ్రైవర్‌గా మారారు. తన తండ్రి రాజకీయ జీవితానికి అండగా నిలబడ్డారు. అందుకే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ఎవరు మాట్లాడినా హరికృష్ణ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది. డ్రైవింగ్‌లో నిష్ణాతుడైనా హరికృష్ణ.. తండ్రిని అసెంబ్లీకి చేర్చిన హరికృష్ణ.. చివరికి ఆ డ్రైవింగ్ వల్లే దుర్మరణం పాలయ్యారు. దీంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హరికృష్ణ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో హరికృష్ణ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు హరికృష్ణ అంతిమయాత్రని ‘చైతన్యరథం’పై నిర్వహించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం చైతన్యరథం అందుబాటులో లేనట్లు సమాచారం. రామకృష్ణా స్టూడియోలో ఉన్న చైతన్యరథాన్ని కొంతకాలం క్రితమే ఆర్ట్ డిపార్ట్మెంట్కు తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా చైతన్య రథాన్ని వాడాలని భావించినట్లు సమాచారం. కానీ అందుబాటులో లేకపోవడంతో మరో వాహనాన్ని డిజైన్ చేసినట్లు సమాచరం. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే మరి కాసేపు ఎదురుచూడాల్సి ఉంది. -
త్వరలో హరికృష్ణ చైతన్య రథయాత్ర!
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన దివంగత ఎన్టీఆర్ గతంలో రాష్ర్టవ్యాప్తంగా చైతన్యరథంలో పర్యటించారు. ఇపుడు అదే రథాన్ని హరికృష్ణ ఉపయోగించనున్నారని తెలిసింది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే ందుకు ఢిల్లీ వెళ్లిన హరికృష్ణ బుధవారం నగరానికి రానున్నారు. వెంటనే అందుబాటులో ఉన్న సన్నిహితులతో చర్చించిన అనంతరం యాత్ర షెడ్యూల్‌ను ఆయన ప్రకటిస్తారని సమాచారం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ నెలాఖరు నుంచి తెలుగు ఆత్మగౌరవయాత్ర చేయనున్నారు. అంతకంటే ముందుగానే హరికృష్ణ తన యాత్రను ప్రారంభించి తొలుత రాయలసీమ, తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. కొద్ది విరామం అనంతరం మిగిలిన జిల్లాల్లో యాత్ర చేస్తారని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా సమైక్యాంధ్ర కోరుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను హరికృష్ణ మంగళవారం ఫోన్లో పరామర్శించారు.