చైతన్య రథం
నందమూరి హరికృష్ణ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పదం ‘చైతన్యరథం’.. దీనికి, హరికృష్ణకి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ‘చైతన్యరథం’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఆ ‘చైతన్యరథం’పైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. అయితే ఆ చైతన్యరథానికి రథసారథి హరికృష్ణ. తండ్రి కోసం ‘సీతయ్య’ డ్రైవర్‌గా మారారు. తన తండ్రి రాజకీయ జీవితానికి అండగా నిలబడ్డారు. అందుకే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ఎవరు మాట్లాడినా హరికృష్ణ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది.
డ్రైవింగ్‌లో నిష్ణాతుడైనా హరికృష్ణ.. తండ్రిని అసెంబ్లీకి చేర్చిన హరికృష్ణ.. చివరికి ఆ డ్రైవింగ్ వల్లే దుర్మరణం పాలయ్యారు. దీంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హరికృష్ణ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో హరికృష్ణ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు హరికృష్ణ అంతిమయాత్రని ‘చైతన్యరథం’పై నిర్వహించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ ప్రస్తుతం చైతన్యరథం అందుబాటులో లేనట్లు సమాచారం. రామకృష్ణా స్టూడియోలో ఉన్న చైతన్యరథాన్ని కొంతకాలం క్రితమే ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా చైతన్య రథాన్ని వాడాలని భావించినట్లు సమాచారం. కానీ అందుబాటులో లేకపోవడంతో మరో వాహనాన్ని డిజైన్ చేసినట్లు సమాచరం. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే మరి కాసేపు ఎదురుచూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment