
అవనిగడ్డ : మాజీ రాజ్యసభ సభ్యులు, సినీనటుడు నందమూరి హరికష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. దివిసీమ పర్యటనకు వచ్చిన ఆయన తన వియ్యంకుడు మాదివాడ విష్ణుమూర్తి స్వగృహంలో హరికృష్ణ రోడ్డు ప్రమాద దృశ్యాలను టీవీలో చూశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ హరికష్ణ తనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారన్నారు.
ఎన్‌టీ రామారావు టీడీపీ స్ధాపించిన తరువాత ఛైతన్యరధంకు హరికృష్ణ సారధిగా వ్యవహరించారని అన్నారు. అప్పటి నుంచే తాను ఆయనతో కలిసి పనిచేసినట్టు చెప్పారు. పాలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్న సమయంలో ఆయన కూడా సభ్యునిగా ఉన్నారని ఎప్పుడు కనబడినా ఎంతో ఆప్యాయతగా పలుకరించేవారని తెలిపారు. ఎన్‌టీఆర్ ఛైతన్య రధంకు సారధ్యం వహించి రాష్ట్ర మంతా తిప్పిన ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తను తీవ్రంగా కలచి వేసిందన్నారు.
సర్పశాంతి హోమంపై ఆరా....
దివిసీమలో పాముకాట్లు పెరిగిన నేపధ్యంలో మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆధ్వర్యంలో బుధవారం సర్పశాంతి హోమం చేశారని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ హోమంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పాముకాట్లు, తీసుకుంటున్న చర్యలు, సర్పశాంతి హోమం గురించిన విషయాలను హోమంత్రి బుద్ధప్రసాద్‌ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ యువజన వికాస సమితి ఛైర్మన్ మండలి వెంకట్రామ్ (రాజా), ఎంపీపీ బీవీ కనకదుర్గ, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, డిఎస్పీ వి పోతురాజు, న్యాయవాది మాదివాడ వెంకటకృష్ణారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment