ఐపీఎల్ జట్లకే ఆడనున్న కలిస్, పొలార్డ్
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ
న్యూఢిల్లీ: స్టార్ ఆటగాళ్లు జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా), కీరన్ పొలార్డ్(వెస్టిండీస్)... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో ఐపీఎల్ జట్లకే ప్రాతినిధ్యం వహించనున్నారు. తమ దేశవాళీ జట్లు కేప్ కోబ్రాస్ (దక్షిణాఫ్రికా), బార్బడోస్ ట్రైడెంట్స్ (వెస్టిండీస్) లీగ్‌కు అర్హత సాధించినా ఈ ఇద్దరు మాత్రం ఫ్రాంచైజీల వైపే మొగ్గు చూపారు. గత సీజన్లలో మాదిరిగానే ఈసారి కూడా ఏ జట్టుకు ఆడాలనే నిర్ణయాన్ని ఆటగాడికే వదిలేశామని సీఎల్‌టి20 గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డీన్ కినో చెప్పారు. అయితే ఆటగాడు ‘బయటి’ టీమ్‌ను ఎంచుకుంటే ఆ ఫ్రాంచైజీ... ఆటగాడి దేశవాళీ జట్టుకు 1 లక్షా 50 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 90 లక్షల 75 వేలు) చెల్లించాలి.
ఐపీఎల్లో బెంగళూరు కోచ్ డానియెల్ వెటోరీ ఈ లీగ్‌లో తమ దేశవాళీ జట్టు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ప్రావిన్స్ తరఫున ఆడనున్నాడు. సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ టోర్నీలో 10 జట్లు 29 మ్యాచ్‌లు ఆడనున్నాయి. లాహోర్ లయన్స్, ముంబై ఇండియన్స్, నార్తర్న్ నైట్స్, సదరన్ ఎక్స్‌ప్రెస్ జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడతాయి. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు గ్రూప్ దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగతా నాలుగింటితో మ్యాచ్‌లు ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
గ్రూప్-ఎ: కోల్‌కతా, చెన్నై, డాల్ఫిన్స్, పెర్త్ స్కార్చర్స్, క్వాలిఫయర్-1.
గ్రూప్-బి: పంజాబ్, కేప్ కోబ్రాస్, హోబర్ట్ హరికేన్స్, బార్బడోస్ ట్రెడెంట్స్, క్వాలిఫయర్-2.