మూఢనమ్మకాలను విశ్వసించొద్దు
మంచాల: మూఢ నమ్మకాలను విశ్వసించొద్దని మంచాల సీఐ జగదీశ్వర్ ప్రజలకు సూచించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని చాంద్ఖాన్గూడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని ఓ మహిళ ఇటీవల చనిపోయి దెయ్యమై గ్రామస్తులపై దాడి చేస్తోందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఇంటి ఎదుట కాముని బూడిద, చెప్పులు ఉంచుతున్న విషయం విధితమే. సోమవారం మంచాల సీఐ జగదీశ్వర్ సిబ్బందితో కలిసి చాంద్ఖాన్గూడను సందర్శించారు. ఇంటింటికి తిరిగి గ్రామస్తు లకు అవగాహన కల్పించారు. దెయ్యాలు, భూతాలు లేవని చెప్పారు. మూఢ విశ్వాసాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా సీఐ జగదీశ్వర్ గ్రామ యువకులతో మాట్లాడారు.
నేటి కంప్యూటర్ యుగంలో కూడా దెయ్యాలు ఉన్నాయని విశ్వసించడం మూర్ఖత్వమే అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురవకుండా పుకార్లను నమ్మొద్దని సీఐ చెప్పారు. చదువుకున్న యువత నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దెయ్యాలు ఉన్నాయని విశ్వసించి భూత వైద్యులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ పేర్కొన్నారు. త్వరలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో మంచాల ఎస్సై రవికుమార్, సిబ్బంది ఉన్నారు.