ఓవర్‌డోస్ పర్యవసానం
అక్షర తూణీరం
చాలా ప్రధాన వీధులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. రూట్లు నిర్ధారించి బోట్లు వేసేస్తే కొంతమేర కాశ్మీర కళ వస్తుంది. ఇక మెరక వీధుల మీద దృష్టి పెడితే ఏడాదిన్నరలో ఇక్కడ కుంకుమ పూదోటలు ఘుమఘుమలాడడం ఖాయం.
మహారాజు పరమ నిష్ఠాగరిష్టుడు. సత్యసంధుడు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌లాగా ఒక పద్ధతి గల మనిషి. ఒక రోజు రాజు తన ఎర్రవెల్లి తోట నుంచి కోటకి గుర్రం మీద వస్తున్నాడు. వాగు దాటే వేళ రాయి మీద గిట్ట జారింది. గుర్రం పడిపోయింది. రాజు పక్కనే ఉన్న ఊబిలో పడ్డాడు. ఎంత ప్రయత్నించినా లేవలేకపోయాడు. రాజు ఒక్కసారి ఆకాశం వైపు తిరిగి, ‘ఓ ముక్కోటి దేవత లారా! నేను ఆకస్మికంగా ఊబిలో పడ్డాను. లేవలేక పోతున్నాను. నేనే కనక ధర్మపరుడినైతే, నేనే కనక మిమ్ముల నమ్మి కొలుస్తున్నట్టైతే- నన్నీ ఊబిలోంచి బయట పడెయ్యండి!’ అంటూ ప్రార్థించాడు. మరు క్షణం పురాణ ఫక్కీలో ఆకాశంలో మెరుపులు మెరిశాయి.
చెట్లు పూనకం వచ్చినట్టు ఊగాయి. రాజు ఒక్కసారిగా లేచి, రివ్వున ఎగిరి దూరంగా మరో ఊబిలో పడ్డాడు. ఈ దృశ్యాన్ని చూసిన గుర్రం విచిత్రంగా సకిలించింది. రాజుకి రోషం వచ్చింది. ‘‘సాయం కోరితే చేయుట ఇట్లేనా’’ అని ఆకాశాన్ని సూటిగా ప్రశ్నించాడు. వెంటనే మెటాలిక్ వాయిస్‌లో జవాబు వచ్చింది- ‘‘మారాజా! చిన్న గుంటలోంచి లేవడానికి ముక్కోటి దేవతలను సాయమడిగావ్. అందరూ తలో చెయ్యి వేశారు. దాంతో నువ్ పోయి ఎక్కడో పడ్డావ్.’’ తన ప్రార్థన ఓవర్‌డోస్ అయిందని రాజు గ్రహించాడు.
ఇప్పుడు కూడా అదే జరిగింది. క్రిందటి సంవత్సరం చివర్లో మన సొంత ఎస్టేట్‌లో చండీయాగం చేశాం. అలా ఇలా కాదు. ఇలాతలం దద్దరిల్లే విధంగా. ఎన్ని యజ్ఞకుండాలు, ఎందరు రుత్త్విక్కులు, ఎన్ని సమర్పణలు, ఎందరు వీఐపీలు, ఎంతటి కవరేజి?! స్తోత్రాలు, ఆహుతులు చేరవలసిన వారికి చేరాయి. ఫైళ్లు గబగబా కదిలాయి. తెలంగాణలో వచ్చే రుతువులో వర్షం బాగా పడేట్టు చూడండని అమ్మవారు ఆదేశిం చింది. కేసీఆర్ సోమయాజిగా నడిపిన చండీయాగం పూజలు గుర్తొచ్చినప్పుడల్లా దిక్పాలకులకి వాన మాట హెచ్చరించడంతో ఈ స్థితి దాపురించిందని ఒక పెద్దాయన విశ్లేషిస్తున్నాడు. మన నేత భక్తి ఓవర్‌డోస్ అయిందని ప్రాజ్ఞులు తేల్చారు.
ఏమిటి దీనికి విరుగు డని సవినయంగా వారిని అడిగాను. ఏంలేదు, ఈసారి రుత్త్విక్కులని సగానికి తగ్గించడం, దానాలూ దక్షిణలూ కూడా కుదించుకోవడం మంచిదన్నారు. భక్తిశ్రద్ధల విషయంలో కూడా నాలుగు డిగ్రీలు రాజీపడితే ఇంతింత కుంభవృష్టి పడే ప్రమాదం ఉండదన్నారు. ఈలోగా విశ్వనగరాన్ని క్షుణ్ణంగా రిపేరు చేసుకుంటే, ఇహ తర్వాత రెచ్చిపోవచ్చు. మన నగరాన్ని భూతల స్వర్గం కాశ్మీరంలా చేసుకోవడం తేలిక అనిపిస్తుంది. ఇప్పటికే చాలా ప్రధాన వీధులు నీళ్లతో కళకళలాడు తున్నాయి. రూట్లు నిర్ధారించి బోట్లు వేసేస్తే కొంత మేర కాశ్మీర కళ వస్తుంది. ఇక మెరక వీధుల మీద కార్పొ రేషను, కేటీఆర్ దృష్టి పెడితే ఏడాదిన్నరలో ఇక్కడ కుంకుమ పూదోటలు ఘుమఘుమలాడడం ఖాయం. అప్పుడు గత పాలకులపై బురద జల్లకుండా కుంకుమ పూలని ఆస్వాదించవచ్చు.
ఇదిగో ఇప్పుడు బతుకమ్మల మీదకు మళ్లుకుం టున్నారు. నాకు భయంగా ఉందని ఒక ఆధ్యాత్మికవేత్త కంగారు పడ్డాడు. ‘‘ఈసారి బతుకమ్మ పూజకి బడ్జెట్ పెంచారు. అటు భక్తిభావం పెరిగింది. ఇక ఆవిడ కూడా ఒకటిన్నర రెట్లు కరుణిస్తే ... అమ్మో చాలా డేంజరండీ!’’ అన్నాడు. ఈ భక్తి విప్లవాన్ని ఎవరైనా ఆపి పుణ్యం కట్టుకుంటే బాగుండు.
శ్రీరమణ,
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)