మధ్యాహ్న 'భోజనం' తో చిన్నారులకు అస్వస్థత
నలందా జిల్లాలోని చాందీ బ్లాక్‌లోని తరారీ గ్రామంలో బుధవారం ప్రాధమిక పాఠశాలలో వడ్డించిన భోజనం తిని 15 మంది చిన్నారులతోపాటు టీచర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు బ్లాక్ ఎడ్యుకేషన్ (బీడీఓ) అఫీసర్ చిత్తరంజన్ ప్రసాద్ వెల్లడించారు. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వారు ఫిర్యాదు చేశారు. దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఆ వార్త తెలిసిన వెంటనే జిల్లా అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. ఆ ఆహార పదార్థాలను పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ప్రయోగశాలకు పంపినట్లు బీడీఓ తెలిపారు.
మధ్యాహ్న భోజనం కింద భోజనం చేసి గతనెల్లో శరన్ జిల్లా చాప్రా డివిజన్లో గందమయి గ్రామంలో 23 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనతో నివ్వెరపడిన బీహార్లొని నితీశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించినట్టు గప్పాలు పలికింది. అయిన బీహార్ రాష్ట్రంలో ఏదో మూల మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం చేసిన విద్యార్థులు ఆసుపత్రులపాలైన సందర్భాలు లెక్కలుమిక్కిలిగా పోగుపడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బుధవారం తరారీ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన ఓ ఉదాహారణ మాత్రమే.