నేములోనేముంది?
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది. కానీ ఛత్తీస్ గఢ్ నేత అజిత్ జోగి తలచుకుంటే ఒకే పేరున్న క్యాండిడేట్ల వర్షం కురుస్తుంది. ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ నుంచి లోకసభ ఎన్నికల బరిలో ఉన్న అజిత్ జోగి తన బిజెపి ప్రత్యర్థి చందూలాల్ సాహూని ఓడించేందుకు ఒకటి కాదు, ఇద్దరు కాదు ఏకంగా పది మంది సాహూలతో నామినేషన్ వేయించారు. వీరందరి పేరూ బిజెపి అభ్యర్థి పేరే!
వీరిలో ఆరుగురు చందులాల్ సాహూలు. ఒకరు చందూరామ్ సాహూ.మిగతా వారందరి పేరులోనూ సాహూ ఉంది. కాబట్టి బిజెపి ఓటర్లు కన్ ఫ్యూజ్ అయిపోయి ఒక చందూరామ్ కి వేయాల్సిన ఓటు ఇంకో చందూరామ్ కి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాగోలా మహాసముంద్ ఎన్నికల సముద్రం ఈదేయచ్చునన్నదే జోగి గారి ప్లాన్.
ఈ సాహూలందరినీ విత్ డ్రాచేయించాలని బిజెపి ఎంతో ప్రయత్నించింది. కానీ అందరూ అజ్ఞాతంలోకి వెళ్లడమే కాదు, వాళ్ల ఫోన్లు కూడా స్విచాఫ్ అయిపోయాయట. ఇప్పుడు మహాసముంద్ లో బిజెపి అభ్యర్థి బుర్ర స్విచాఫ్ అయిపోయింది. జోగితో పోరాడాలా లేక సాహూలతో పోరాడాలా అన్నది పాపం ఒరిజినల్ చందూలాల్ సాహూకి అర్థం కావడం లేదట.