ఫ్రాన్స్ ప్రతీకారం!
డోవర్: ఒకదాని వెంటే మరో వాహనం.. 20 కిలోమీటర్లకుపైగా స్తంభించిన ట్రాఫిక్. వేలాది వాహనాల్లో లెక్కకు మించిన జనం.. పైన ఎండ వాత.. లోన ఉక్కపోత.. గంటా రెండు గంటలూ కాదు గడిచిన రెండు రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి. ఇప్పుడు స్తంభించిన ట్రాఫిక్ క్లియర్ చేయాలంటేనే ఇంకో రెండు రోజులు పడుతుంది. వాహనాల్లో చిక్కకుపోయిన పిల్లలు, వృద్ధులు, మహిళలదైతే అరిగోస! ప్రభుత్వం తన వంతుగా ప్రయాణికులకు 11వేల నీళ్ల బాటిళ్లను సరఫరా చేస్తోంది. ట్రాఫిక్ క్లియరెన్స్ పై మాత్రం చేతులెత్తేసింది. ఎందుకంటే ఆ పని చేయాల్సింది పొరుగుదేశం కాబట్టి!
బ్రిటన్- ఫ్రాన్స్ సరిహద్దులోని డోవర్ పట్టణంలో గడిచిన 50 గంటలుగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నీస్ ట్రక్కు దాడి తర్వాత అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేసిన ఫ్రాన్స్.. అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాల తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో బ్రిటన్ నుంచి చానెల్ టన్నెల్ మీదుగా ఫ్రాన్స్ వెళ్లాల్సిన వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక్కో వాహనం తనిఖీకి 40 నిమిషాలు పడుతుండటంతో ఇప్పుడున్న ట్రాఫిక్ క్లియరెన్స్ కే రెండు లేదా అంతకు మించి రోజుల సమయం పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రాన్స్ బ్రిటన్ సరిహద్దును దాదాపు మూసేసినంత పని చేయడంతో బ్రిటిషర్లు భగ్గుమంటున్నారు. ఫ్రాన్స్ బ్రెగ్జిట్ కు ప్రతీకారం తీర్చుకుంటోందని నెటిజన్లు భావిస్తున్నారు.