in charge of the
-
మెరుగైన సేవలందిస్తా
జేసీగా బాధ్యతలు స్వీకరించిన హరికిరణ్ సాక్షి, కర్నూలు: రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన జిల్లా 39వ జేసీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఏజేసీ రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడ్, ఏఓ పి.వి.రమణరావు తదితరులు జేసీకి స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్లో జేసీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కొత్త అయినప్పటికీ ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తానన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ సూచనలతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తానన్నారు. జిల్లాలో తహశీల్దార్లు ఏ ప్రాంతంలో ఎంత కాలంగా పని చేస్తున్నారో వివారాలు ఇవ్వాలని ఏఓ రమణరావును ఆదేశించారు. అదేవిధంగా సెక్షన్ సూపరింటెండెంట్ల పని తీరును అడిగి తెలుసుకున్నారు. మీ-సేవ కేంద్రాల్లో పెండింగ్ దరఖాస్తుల వివరాలపై ఆర్ఐ కీర్తిని ప్రశ్నించారు. ఆ తర్వాత కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
టీడీపీలోకి ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి?
సీఎం రమేష్ ద్వారా బాబుతో మంతనాలు నేడో,రేపో పార్టీలో చేరికకు ముహుర్తం ఖరారు ఆయనతో పాటే ఆయన సోదరుడు, వర్గీయులు పలమనేరు: జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. జిల్లాకు చెందిన ఇరువురు ముఖ్యనేతలతో పాటు సీఎం రమేష్ ద్వారా ఇప్పటికే చంద్రబాబుతో చర్చించారని, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. నేడో, రేపో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న రెడ్డెప్పరెడ్డి కిరణ్ సర్కార్ చొరవ తో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కిరణ్ రాజీనామా చేశాక జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పరోక్షంగా పనిచేశారు. కానీ ఆ పార్టీలో భవిష్యత్తు ఉండదని భావించి పరోక్షంగా టీడీపీకి మద్దతు పలుకుతూ వచ్చారు. సోమవారం మంచి రోజు కావడంతో ఆ రోజే పార్టీలో చేరనున్నట్టు ఆయన సోదరుడు విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. రెడ్డెప్పరెడ్డితో పాటు ఆయన సోదరుడు, నియోజకవర్గంలోని అనుచరులు పలమనేరు పట్టణానికి చెందిన ఇరువురు మైనారిటీ నాయకులు టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ చేరికతో మారనున్న సమీకరణలు పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా సుభాష్‌చంద్రబోస్ వ్యవహరిస్తున్నారు. రెడ్డెప్పరెడ్డి రాకతో ఇన్చార్జ్ బాధ్యతలు ఆయనకే దక్కుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలోని కొందరు స్థానిక నేతలు రెడ్డెప్పరెడ్డి నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఎన్నికల్లో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన బోస్ పార్టీకి అండగా ఉండగా ఎమ్మెల్సీని పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరమేమొచ్చిందని అదే పార్టీకి చెందిన కొందరు మధనపడుతున్నారు. -
ఐపీఎస్ అధికారిగా కిరోసిన్ హాకర్ కొడుకు
కర్ణాటక పోలీస్ శాఖలో 16న బాధ్యతలు స్వీకరించనున్న కిశోర్‌బాబు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన యువకుడు గుడివాడ, న్యూస్‌లైన్ : జీవిత లక్ష్యసాధనకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఈ యువకుడు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో డిగ్రీ వరకు చదివిన ఈ యువకుడు ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరాలనే తన లక్ష్యాన్ని సాధించాడు. ఓటమి చెందినా వెరవకుండా అవిశ్రాంతంగా పోరాడి సాధించాడు. కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం గంగాధరపురం గ్రామానికి చెందిన డెక్కా కిశోర్‌బాబు ఈ నెల 16న కర్ణాటక పోలీసు శాఖలో ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం తన స్వగ్రామానికి వచ్చిన ఆయన్ను ‘న్యూస్‌లైన్’ పలకరిచింది. ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే వారు వైఫల్యాలు ఎదురైనా సాధించే వరకుకొనసాగించాలని యువకులకు సందేశం ఇచ్చారు. పంచాయతీరాజ్ ఈవోపీఆర్డీగా.. కళాశాల లెక్చరర్‌గా పనిచేసి.. కిశోర్ ఐదేళ్లపాటు జిల్లాలోని తోట్లవల్లూరు మండలంలో ఈవోపీఆర్డీగా ప్రభుత్వోద్యోగం నిర్వహించారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామాచేసి అక్కడ నుంచి రెండేళ్లుపాటు ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. నాలుగు సార్లు సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరైన ఆయన ఐదోసారి విజయాన్ని సాధించారు. దిగువ మధ్యతరగతి కుటుంబమే.. కిశోర్బాబుది దిగువ మధ్యతరగతి కుటుంబమే. గుడివాడ రూరల్ మండలంలోని బొమ్ములూరు శివారు గంగాధరపురం గ్రామం. తండ్రి ప్రసాదరావు కేవలం ఐదో తరగతి వరకే చదివాడు. తల్లి సుశీల పెద్దగా చదవుకోలేదు. తండ్రి ప్రసాదరావు కిరోసిన్ హాకర్‌గా గుడివాడ పట్టణంలోని నలంద స్కూల్ సమీపంలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు తనను పెద్దపెద్ద పాఠశాలల్లో చదివించలేరని తెలిసినా తన లక్ష్యాన్ని మాత్రం ఏనాడు విస్మరించలేదని చెబుతున్నారు. కిశోర్‌బాబు గంగాధరపురం మండల పరిషత్ పాఠశాలలో ప్రాథమిక చదువులు చదివి అనంతరం నిమ్మకూరు గురుకుల పాఠశాలలో ఎనిమిది నుంచి 10వ తరగతి వరకు చదివాడు. ఆతరువాత ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు గుడివాడలోని ఏఎన్నార్ కళాశాలలో బీఎస్సీ (మ్యాథ్స్) చదివారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేశారు. ఇదే సమయంలో పంచాయతీరాజ్‌శాఖ ఈవోపీఆర్డీ పోస్టు రావటంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. చిన్నతనం నుంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదవాలనేది తన లక్ష్యంగా చెబుతున్నారు. తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగా పయనించేందుకుగాను తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఖమ్మంజిల్లా ఇల్లెందులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చలర్‌గా చేరారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యంనే ఏనాడు విస్మరించలేదని చెబుతున్నారు. కిషోర్ భార్య సంధ్య భీమవరంలోని ఒక కళాశాలలో ఈసీఈ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఒక కుమార్తె కూడా ఉన్నారు. కిశోర్ సోదరి తహశీల్దార్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్ల కృషి ఫలించింది... సివిల్ సర్వీస్ అధికారిగా ఎంపిక కావాలనే లక్ష్యంకోసం ఎనిమిదేళ్లుగా అలుపెరగని కృషి చేశానని కిశోర్ ‘న్యూస్‌లైన్’కు వివరించారు. నాలుగుసార్లు ప్రిమిలినరీ, మెయిన్స్లోఉత్తీర్ణత సాధించినా నాలుగుసార్లు ఇంటర్వ్యూలో విఫలం చెందానని అన్నారు.ఐదోసారి లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు. 2012 బ్యాచ్‌లో ఎంపికైన తనకు ఈనెల 16న కర్ణాటకా పోలీసు శాఖలో బాధ్యతలు ఇవ్వనున్నారని చెప్పారు. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనుకునే వారు వైఫల్యాలు ఎదురైనా నిరాశ చెందకుండా కొనసాగిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారని చెప్పారు. తన విజయంలో తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల సహకారం ఉందని అన్నారు. ప్రజలు మెచ్చే పోలీసు అధికారిగా పనిచేయాలనేది తన జీవిత లక్ష్యంగా వివరించారు.