ఐపీఎస్ అధికారిగా కిరోసిన్ హాకర్ కొడుకు | Hawker kerosene IPS officer's son | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ అధికారిగా కిరోసిన్ హాకర్ కొడుకు

Published Fri, Jun 6 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

Hawker kerosene IPS officer's son

  • కర్ణాటక పోలీస్ శాఖలో 16న బాధ్యతలు స్వీకరించనున్న కిశోర్‌బాబు
  •  పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన యువకుడు
  •  గుడివాడ, న్యూస్‌లైన్ : జీవిత లక్ష్యసాధనకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఈ యువకుడు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో డిగ్రీ వరకు చదివిన ఈ యువకుడు ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరాలనే తన లక్ష్యాన్ని సాధించాడు. ఓటమి చెందినా వెరవకుండా అవిశ్రాంతంగా పోరాడి సాధించాడు.

    కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం గంగాధరపురం గ్రామానికి చెందిన డెక్కా కిశోర్‌బాబు ఈ నెల 16న కర్ణాటక పోలీసు శాఖలో ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం తన స్వగ్రామానికి వచ్చిన ఆయన్ను ‘న్యూస్‌లైన్’ పలకరిచింది. ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే వారు వైఫల్యాలు ఎదురైనా సాధించే వరకుకొనసాగించాలని యువకులకు సందేశం ఇచ్చారు.
     
    పంచాయతీరాజ్ ఈవోపీఆర్డీగా.. కళాశాల లెక్చరర్‌గా పనిచేసి..

     కిశోర్ ఐదేళ్లపాటు జిల్లాలోని తోట్లవల్లూరు మండలంలో ఈవోపీఆర్డీగా ప్రభుత్వోద్యోగం నిర్వహించారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామాచేసి అక్కడ నుంచి రెండేళ్లుపాటు ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. నాలుగు సార్లు సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరైన ఆయన ఐదోసారి విజయాన్ని సాధించారు.
     
    దిగువ మధ్యతరగతి కుటుంబమే..

    కిశోర్‌బాబుది దిగువ మధ్యతరగతి కుటుంబమే. గుడివాడ రూరల్ మండలంలోని బొమ్ములూరు శివారు గంగాధరపురం గ్రామం. తండ్రి ప్రసాదరావు కేవలం ఐదో తరగతి వరకే చదివాడు. తల్లి సుశీల పెద్దగా చదవుకోలేదు. తండ్రి ప్రసాదరావు కిరోసిన్ హాకర్‌గా గుడివాడ పట్టణంలోని నలంద స్కూల్ సమీపంలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు తనను పెద్దపెద్ద పాఠశాలల్లో చదివించలేరని తెలిసినా తన లక్ష్యాన్ని మాత్రం ఏనాడు విస్మరించలేదని చెబుతున్నారు.  

    కిశోర్‌బాబు గంగాధరపురం మండల పరిషత్ పాఠశాలలో ప్రాథమిక చదువులు చదివి అనంతరం నిమ్మకూరు గురుకుల పాఠశాలలో  ఎనిమిది నుంచి 10వ తరగతి వరకు చదివాడు. ఆతరువాత ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు గుడివాడలోని ఏఎన్నార్ కళాశాలలో   బీఎస్సీ (మ్యాథ్స్) చదివారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేశారు. ఇదే సమయంలో పంచాయతీరాజ్‌శాఖ ఈవోపీఆర్డీ పోస్టు రావటంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు.

    చిన్నతనం నుంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదవాలనేది తన లక్ష్యంగా చెబుతున్నారు. తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగా పయనించేందుకుగాను తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఖమ్మంజిల్లా ఇల్లెందులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చలర్‌గా చేరారు.  ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యంనే ఏనాడు విస్మరించలేదని చెబుతున్నారు. కిషోర్ భార్య సంధ్య భీమవరంలోని ఒక కళాశాలలో ఈసీఈ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఒక కుమార్తె కూడా ఉన్నారు. కిశోర్ సోదరి తహశీల్దార్‌గా పనిచేస్తున్నారు.
     
    ఎనిమిదేళ్ల కృషి ఫలించింది...

    సివిల్ సర్వీస్ అధికారిగా ఎంపిక కావాలనే లక్ష్యంకోసం ఎనిమిదేళ్లుగా అలుపెరగని కృషి చేశానని కిశోర్ ‘న్యూస్‌లైన్’కు వివరించారు. నాలుగుసార్లు ప్రిమిలినరీ, మెయిన్స్‌లోఉత్తీర్ణత సాధించినా నాలుగుసార్లు ఇంటర్వ్యూలో విఫలం చెందానని అన్నారు.ఐదోసారి లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు. 2012 బ్యాచ్‌లో ఎంపికైన తనకు  ఈనెల 16న కర్ణాటకా పోలీసు శాఖలో బాధ్యతలు ఇవ్వనున్నారని చెప్పారు. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనుకునే వారు వైఫల్యాలు ఎదురైనా నిరాశ చెందకుండా కొనసాగిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారని చెప్పారు. తన విజయంలో తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల సహకారం ఉందని అన్నారు. ప్రజలు మెచ్చే పోలీసు అధికారిగా పనిచేయాలనేది తన జీవిత లక్ష్యంగా వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement