నా కూతురు, కొడుకు కూడా...
సైన్యంలో చేరాలని కోరిక
అశోక్చక్ర అవార్డు గ్రహీత హవల్దార్ హంగ్పన్ దాదా భార్య లోవాంగ్
న్యూఢిల్లీ: దేశం కోసం తన భార్త ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందని, అయితే, తన కూతురు, కుమారుడు కూడా సైన్యంలో చేరాలని కోరుకుంటున్నానని అశోక్చక్ర అవార్డు గ్రహీత, అస్సాం రెజిమెంట్‌కు చెందిన దివంగత హవల్దార్ హంగ్పన్ దాదా భార్య చాసెన్ లోవాంగ్ అన్నారు. తన పిల్లలు సైన్యంలో చేరి తండ్రి మాదిరిగా దైర్యసాహసాలను ప్రదర్శించాలని ఆమె కోరుకుంటోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు.
గత మే 26న హంగపన్ దాదా జమ్ము, కశ్మీర్లో టెర్రరిస్టులతో హోరాహోరీ పోరాడి ముగ్గురిని హతమార్చి తాను అసువులు బాసిన విషయం తెలిసిందే. టెర్రరిస్టులను ఎదుర్కోవడంలో దాదా ప్రదర్శించిన దైర్యసాహసాలకుగాను ఆయనకు అశోక్చక్ర అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తన భర్త దైర్యసాహసాలకు అత్యున్నత పురస్కారం రావడం ఆనందంగా ఉందని, అదే సందర్భంలో బాధగా కూడా ఉందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లలు కూడా సైన్యం చేరాలని తన భర్త తరచూ అనేవారని ఆమె గుర్తు చేశారు. విష సర్పాల కంటే ఉగ్రవాదులు ప్రమాదకారులని వ్యాఖ్యానించారు.