పన్ను వసూళ్లలో ‘లీకేజీ’లు
- సర్కార్‌కు రూ. 2వేల కోట్లకు పైగా నష్టం
- వాణిజ్య పన్ను నిర్ధారణల్లో అవకతవకలు
- వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు
- 2014-15లో పన్ను నిర్ధారణలో లోపాల వల్ల రూ. 308 కోట్ల నష్టంగా గుర్తించిన కాగ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, పాలన పరమై న లోపాలు... సిబ్బంది కొరత... వ్యాపారులతో కుమ్మక్కు... వెరసి సర్కారుకు వేల కోట్ల రూపాయల పన్ను రాకుండా పోతుంది. చెక్‌పోస్టుల నిర్వహణలో లోపాలు, తనిఖీ వ్య వస్థ బలంగా లేకపోవడం, రాజకీయ ఒత్తిళ్లకు తోడు వ్యాపారులు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ధారించడంలో జరుగుతున్న అవకతవకల వల్ల సర్కార్ ఖజానాకు భారీగా గండిపడుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ సుమారు రూ. 30 వేల కోట్ల పన్ను వసూలు చేసింది. ఈ ‘లీకేజీ’లను అరికట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించకపోవడం వల్ల మరో రూ. 2వేల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.
లీకేజీలు ఇలా..: వ్యాపారం చేస్తున్న డీల ర్లకు పన్ను వర్తింపజేయడంలో అధికార యంత్రాంగం చూపే నిర్లక్ష్యం ఫలితంగా ఏటా రూ.300 కోట్లు, చెక్‌పోస్టులను ఆధునికీకరించకపోవడం వల్ల మరో రూ. 250 కోట్లు నష్టపోతుండగా, ముందస్తు పన్ను చెల్లింపులు ప్రోత్సహిం చడం, పన్ను వాయిదా వేసిన వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయడం వంటి చర్యల వల్ల మరో రూ. 150 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.
ఇవి కాకుండా 14.5 శాతం వ్యాట్ ఉన్న వస్తు సామగ్రి రాష్ట్రంలోకి వివిధ మార్గాల ద్వారా అక్రమంగా రాకుండా అడ్డుకోవడం, ఆడిట్స్ నిర్వహించడం వల్ల మరో రూ. 300 కోట్ల వరకు రాబడి ఉంటుం దని వాణిజ్యపన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇవికాక సర్కార్ తక్షణమే స్పందించి తీసుకునే చర్యల వల్ల మరో రూ. 1000 కోట్ల వరకు రాబట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు పన్ను వసూళ్లలో అవకతవకలు, లీకేజీలతో పాటు వాటిని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యల గురించి సర్కార్‌కు నివేదికను సమర్పించారు.
అధికారుల చిత్తశుద్ధే ముఖ్యం..
2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సర్కార్‌కు వాణిజ్యపన్నుల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ. 30వేల కోట్లలో 12 డివిజన్ల వ్యాపారుల నుంచి వసూలైన మొత్తం సుమారు రూ. 12 కోట్ల వరకే ఉండడం గమనార్హం. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే మరో వందల కోట్ల రూ పాయలు వసూలు చేసే అవకాశం ఉంది.
వాణిజ్యపన్ను తక్కువ నిర్ధారణతోనే రూ. 308 కోట్ల నష్టం: కాగ్
2014-15 ఆర్థిక సంవత్సరంలో తక్కువ పన్ను నిర్ధారణ కేసుల్లోనే రూ. 308 కోట్లు సర్కార్ నష్టపోయినట్లు ‘కాగ్’ తన నివేదికలో తేల్చింది. ఈ తతంగం ప్రతి ఏటా జరిగేదేనని, ఫైళ్లను పరిశీలించినప్పుడు మాత్రమే ఇలాంటివి వెలుగు చూస్తాయని రిటైర్డ్ వాణిజ్యపన్నుల అధికారి ఒకరు తెలిపారు. జిల్లాల స్థాయిలో ఉన్న ఖాళీలతో పాటు చె క్‌పోస్టుల వద్ద అదనపు సిబ్బందిని నియమించడం వల్ల ఈ ‘లీకేజీ’లను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.