cheerleaders
-
IPL: క్యాష్ రిచ్ లీగ్.. చీర్‌లీడర్స్ ఆదాయమెంతో తెలుసా? ఒక్కో మ్యాచ్‌కు..
క్యాష్ రిచ్ లీగ్.. ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. వేలం సందర్భంగా ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెడుతున్న ప్రతిభావంతులు మొదలు.. స్టార్ ప్లేయర్లపై వేలంలో కనక వర్షం కురవడం షరా మామూలే! ఇక పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాగ్జిమమ్ సిక్స్‌లు.. అద్భుత రీతిలో వికెట్లు పడ్డప్పుడు.. ఊహించని క్యాచ్‌లు అందుకున్నపుడు.. ఇలా ప్రతీ కీలక మూమెంట్లో ఆయా జట్లను ఉత్సాహపరుస్తూ చీర్‌లీడర్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు! తమదైన శైలిలో హుషారైన స్టెప్పులతో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకూ కనువిందు చేస్తూ ఉంటారు చీర్‌లీడర్స్. మరి ఒక్కో మ్యాచ్‌కు వారు అందుకునే మొత్తం, చీర్‌లీడర్స్‌కు అధిక మొత్తం చెల్లిస్తున్న ఫ్రాంఛైజీ ఏదో తదితర వివరాలు పరిశీలిద్దాం. ఒక్కో మ్యాచ్‌కు కనీసం ఎంతంటే డీఎన్ఏ రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ చీర్‌లీడర్స్‌కు ఒక్కో మ్యాచ్‌కు సగటున 12,000 రూపాయల నుంచి 17 వేల వరకు ఫ్రాంఛైజీలు చెల్లిస్తాయట. ఇక క్రిక్ఫాక్ట్స్ నివేదిక ప్రకారం.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ చీర్‌లీడర్స్‌కు అత్యధిక మొత్తం చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. అత్యధికంగా ఒక్కో మ్యాచ్‌కు రూ. 24 వేలు పారితోషకంగా కేకేఆర్ అందిస్తోందట. అత్యధికంగా చెల్లించే ఫ్రాంఛైజీ ఏదంటే ఇక చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ చీర్‌లీడర్స్‌కు మ్యాచ్‌కు 12 వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. కాగా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్‌కు పనిచేస్తున్న చీర్‌లీడర్స్‌కు ఒక్కో మ్యాచ్‌కు 20 వేల రూపాయల చొప్పున ముట్టజెప్తున్నారట. అదే విధంగా రాయల చాలెంజర్స్ బెంగళూరు సైతం ముంబై మాదిరే 20 వేలు చెల్లిస్తోందట. ఇలా చీర్‌లీడర్స్ ఒక్కో మ్యాచ్‌కు ఈ మేరకు నగదు అందుకోవడమే కాకుండా.. విలాసవంతమైన హోటళ్లలో బస, రుచికరమైన భోజనంతో ఇతర సదుపాయాలు కూడా పొందుతున్నారు. అంత తేలికేం కాదు ఏంటీ.. ఇదంతా వింటుంటే చీర్‌లీడర్స్ పనే బాగున్నట్లుంది అనుకుంటున్నారా? నిజానికి చీర్‌లీడర్‌గా ఎంపిక కావడం అంత తేలికేం కాదు. స్వతహాగా మంచి డాన్సర్లు అయిన వాళ్లు, మోడలింగ్ రంగంలో ఉన్నవాళ్లను.. అనేక ఇంటర్వ్యూల అనంతరం ఆయా ఫ్రాంఛైజీలు సెలక్ట్ చేస్తాయి. అంతేకాదు వేలాది ప్రేక్షకుల నడుమ రాత్రిపగలు మ్యాచ్‌లనే తేడా లేకుండా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది మరి! ప్రస్తుతం చీర్లీడర్స్గా ఎక్కువ మంది విదేశీయులే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో రెండేసి విజయాలతో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' -
ఆ మ్యాచ్ చీర్ లీడర్లకు పీడకల..
ఆటలోని మజా రెట్టింపయ్యేలా అద్భుత నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేసే చీర్ లీడర్లు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. తమవైపు దూసుకువస్తోన్న వికృత రూపాలను చూసి వణికిపోయారు. ఆ మ్యాచ్ వారికి పీడకల. అవునుమరి, పచ్చినెత్తురు తాగే పిశాచాలు గ్రౌండ్ లోకి చొరబడితే ఎవరికైనా గుండె ఝల్లుమనదా! జపాన్ లో జరిగిన ఓ బేస్ బాల్ మ్యాచ్ లో సడాకో, కయాకో అనే దెయ్యాలు కాసేపు అందరినీ భయభ్రాతులకు గురిచేశాయి. మన దగ్గర కామినీ పిశాచి, శాకిని, ఢాకినీ, మోహినీ, కొరివి.. లాంటి దయ్యాలున్నట్లే జపాన్ లో సడాకో, కయాకో దయ్యాలు ఫేమస్. పచ్చి మనిషి నెత్తురు మాత్రమే సేవించే ఆ దయ్యాలు కాసేపు బ్యాట్, బాల్ పట్టుకుని హల్ చల్ చేశాయి. నిప్పొన్ హ్యామ్ ఫైటర్స్, యాకుల్ట్ స్వాలో జట్ల మధ్య జరగాల్సిన అసలు మ్యాచ్ కు ముందు ఈ దయ్యాల క్యారెక్టర్లు ఆడిన ఈ ఆట తాలూకు వీడియోకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. -
టెక్ కంపెనీల్లో 'చీర్ లీడర్స్'
బీజింగ్: క్రికెట్ లీగ్ మ్యాచుల్లో అభిమానులను ఉల్లాసపరిచి ఉత్తేజితుల్ని చేయడానికి 'చీర్ లీడర్స్' పేరిట అందమైన అమ్మాయిలను రంగంలోకి దింపిన విషయం మనకు తెల్సిందే. అలాగే చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న మగవాళ్లను ఉల్లాసపరిచి ఉత్పాదకతను పెంచేందుకు చీర్ లీడర్స్‌ను రంగంలోకి దింపాయి. 'వారికి ప్రోగ్రామింగ్ చీర్ లీడర్స్'గా నామకరణం కూడా చేశాయి. పొట్టి స్కర్టులు, గౌన్లు ధరించి ఉత్సాహంగా కనిపించే అందమైన ఈ చీర్ లీడర్స్... పని వేళల్లో మగవాళ్లతో కలుపుగోలుగా మాట్లాడుతారు. వారికి కావాల్సిన స్నాక్స్‌ను తెలుసుకొని సకాలంలో సరఫరా చేస్తారు. భోజనం వేళల్లో కంపెనీ ఇస్తారు. జోకులతో నవ్విస్తారు. విరామ సమయాల్లో ఉద్యోగులతో కలసి పింగ్‌పాంగ్ (టేబుల్ టెన్నీస్) ఆడతారు. సరదాగా కబుర్లు చెబుతారు. ఈ విషయాన్ని వెల్లడించిన సామాజిక వెబ్సైట్ 'ట్రెండింగ్ ఇన్ చైనా' ఎన్ని కంపెనీలు ఇప్పటి వరకు ఇలాంటి చీర్ లీడర్లును నియమించిందన్న విషయాన్ని, కంపెనీల పేర్లను మాత్రం వెల్లడించలేదు. అందమైన అమ్మాయిలను చీర్ లీడర్స్‌గా నియమించినప్పటి నుంచి తమ కంపెనీలో వాతావరణమే మారిపోయిందని, మున్నెన్నడులేని విధంగా మగవాళ్లు ఉల్లాసంగా పని చేస్తున్నారని, కంపెనీ ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగిందని ముగ్గురు చీర్ లీడర్లను నియమించిన ఓ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తెలియజేశారు. తమ కంపెనీల్లో కొంత మంది ఉద్యోగులకు సోషల్‌గా ఎలా నడుచుకోవాలో తెలియదని, ఈ చీర్ లీడర్స్ కారణంగా వారిలో ఎంతో మార్పు వచ్చిందని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు తమ ఉద్యోగులంతా ఎంతో ఉత్సాహంతో పని చేస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగుల గురించి ప్రశ్నించగా తమ కంపెనీలో మహిళా ఉద్యోగులు చాలా తక్కువని చెప్పారు. చైనా టెక్ కంపెనీల్లో మొదలైన ఈ కొత్త ట్రెండ్ గురించి విమర్శిస్తున్నవారూ లేకపోలేదు. పని పట్ల చిత్తశుద్ధి ఉండాలేగానీ అందమైన అమ్మాయిలను చూసి పనిచేస్తారా ? అంటూ ప్రశ్నించిన వాళ్లు, వారిని చూసి పని ఎగ్గొట్టి వారితో కబుర్లతో కాలంగడిపేవారు ఉంటారన్న వాళ్లూ ఉన్నారు. 'ఉల్లాసమనేది మగ ఉద్యోగులకేనా, ఆడ ఉద్యోగులకు అవసరం లేదా ?'అని ఓ యూజర్ ప్రశ్నించగా, 'మాకావసరం లేదు, మేము బుద్ధిగా పని చేస్తాం' అంటూ ఓ మహిళా యూజర్ సమాధానమిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ట్రెండ్ చైనా కంపెనీలకు కొత్త కాదు. ఒకప్పుడు ఫ్యాక్టరీల్లో ఉత్పాదకతను పెంచేందుకు విరామ సమయాల్లో కార్మికులకు వేశ్యలను సరఫరా చేసిన చరిత్ర కూడా చైనాకు ఉంది. -
క్రికెటర్లూ.. చీర్‌లీడర్స్‌కు దూరంగా ఉండండి
ఐపీఎల్లో ఆడే క్రికెటర్లెవరూ చీర్‌లీడర్స్‌ను కలవడానికి వీళ్లేదని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. క్రికెటర్లు ఉండే హోటళ్లు, ప్రయాణించే విమానాల్లో చీర్‌లీడర్స్ లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఒక జట్టుకు చెందిన మ్యాచ్‌లన్నింటికీ వేర్వేరు చీర్‌లీడర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఐపీఎల్లో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని బోర్డు ఈ జాగ్రత్తలు తీసుకుంది.