టెక్ కంపెనీల్లో 'చీర్ లీడర్స్'
బీజింగ్: క్రికెట్ లీగ్ మ్యాచుల్లో అభిమానులను ఉల్లాసపరిచి ఉత్తేజితుల్ని చేయడానికి 'చీర్ లీడర్స్' పేరిట అందమైన అమ్మాయిలను రంగంలోకి దింపిన విషయం మనకు తెల్సిందే. అలాగే చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న మగవాళ్లను ఉల్లాసపరిచి ఉత్పాదకతను పెంచేందుకు చీర్ లీడర్స్‌ను రంగంలోకి దింపాయి. 'వారికి ప్రోగ్రామింగ్ చీర్ లీడర్స్'గా నామకరణం కూడా చేశాయి.
పొట్టి స్కర్టులు, గౌన్లు ధరించి ఉత్సాహంగా కనిపించే అందమైన ఈ చీర్ లీడర్స్... పని వేళల్లో మగవాళ్లతో కలుపుగోలుగా మాట్లాడుతారు. వారికి కావాల్సిన స్నాక్స్‌ను తెలుసుకొని సకాలంలో సరఫరా చేస్తారు. భోజనం వేళల్లో కంపెనీ ఇస్తారు. జోకులతో నవ్విస్తారు. విరామ సమయాల్లో ఉద్యోగులతో కలసి పింగ్‌పాంగ్ (టేబుల్ టెన్నీస్) ఆడతారు. సరదాగా కబుర్లు చెబుతారు. ఈ విషయాన్ని వెల్లడించిన సామాజిక వెబ్‌సైట్ 'ట్రెండింగ్ ఇన్ చైనా' ఎన్ని కంపెనీలు ఇప్పటి వరకు ఇలాంటి చీర్ లీడర్లును నియమించిందన్న విషయాన్ని, కంపెనీల పేర్లను మాత్రం వెల్లడించలేదు.
అందమైన అమ్మాయిలను చీర్ లీడర్స్‌గా నియమించినప్పటి నుంచి తమ కంపెనీలో వాతావరణమే మారిపోయిందని, మున్నెన్నడులేని విధంగా మగవాళ్లు ఉల్లాసంగా పని చేస్తున్నారని, కంపెనీ ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగిందని ముగ్గురు చీర్ లీడర్లను నియమించిన ఓ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ తెలియజేశారు. తమ కంపెనీల్లో కొంత మంది ఉద్యోగులకు సోషల్‌గా ఎలా నడుచుకోవాలో తెలియదని, ఈ చీర్ లీడర్స్ కారణంగా వారిలో ఎంతో మార్పు వచ్చిందని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు తమ ఉద్యోగులంతా ఎంతో ఉత్సాహంతో పని చేస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగుల గురించి ప్రశ్నించగా తమ కంపెనీలో మహిళా ఉద్యోగులు చాలా తక్కువని చెప్పారు.
చైనా టెక్ కంపెనీల్లో మొదలైన ఈ కొత్త ట్రెండ్ గురించి విమర్శిస్తున్నవారూ లేకపోలేదు. పని పట్ల చిత్తశుద్ధి ఉండాలేగానీ అందమైన అమ్మాయిలను చూసి పనిచేస్తారా ? అంటూ ప్రశ్నించిన వాళ్లు, వారిని చూసి పని ఎగ్గొట్టి వారితో కబుర్లతో కాలంగడిపేవారు ఉంటారన్న వాళ్లూ ఉన్నారు. 'ఉల్లాసమనేది మగ ఉద్యోగులకేనా, ఆడ ఉద్యోగులకు అవసరం లేదా ?'అని ఓ యూజర్ ప్రశ్నించగా, 'మాకావసరం లేదు, మేము బుద్ధిగా పని చేస్తాం' అంటూ ఓ మహిళా యూజర్ సమాధానమిచ్చిన సందర్భాలూ ఉన్నాయి.
ఇలాంటి ట్రెండ్ చైనా కంపెనీలకు కొత్త కాదు. ఒకప్పుడు ఫ్యాక్టరీల్లో ఉత్పాదకతను పెంచేందుకు విరామ సమయాల్లో కార్మికులకు వేశ్యలను సరఫరా చేసిన చరిత్ర కూడా చైనాకు ఉంది.