పొట్టలో కండోమ్‌లు..వాటిల్లో వజ్రాలు
చెన్నై: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త ఐడియాలు ఫాలో అవుతున్నారు. ఎన్నిరకాలుగా భద్రత కట్టుదిట్టం చేసినా నిఘా అధికారుల కళ్లుగప్పి ఏదో మార్గంలో బంగారం, విలువైన వజ్రాలను దొంగ రవాణ చేయడానికి ప్రయతిస్తునే ఉన్నారు స్మగ్లర్లు. తాజాగా ఓ స్మగ్లర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే... కొలంబో నుంచి చెన్నైకు నిన్న (శుక్రవారం) సాయింత్రం వచ్చిన విమాన ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు.
చెన్నైకి చెందిన అతని పేరు మహ్మద్ ఇర్ఫాన్ టూరిస్టు వీసాలో శ్రీలంకకు వెళ్లాడు. తిరిగి చెన్నై విమానాశ్రయం చేరుకున్న అతడి ప్రవర్తన అసహజంగా ఉండటంతో..కస్టమ్స్ అధికారులు... ప్రత్యేక గదికి తీసుకువెళ్లి వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించగా అతడి కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతనికి వైద్యులు ఎనిమా ఇచ్చారు. కొద్దిసేపటికి అతని కడుపులో నుంచి మూడు కండోమ్‌లు వెలుపలికి వచ్చాయి. ఇందులో 18 వజ్రపు రాళ్లు ఉండడం చూసి వైద్యులు కంగుతిన్నారు. వీటి విలువ రూ.60 లక్షలుగా తెలిసింది. అతనిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
అలాగే శ్రీలంక నుంచి చెన్నైకు శుక్రవారం రాత్రి వచ్చిన విమానంలో ముగైదీన్ (33) అనే వ్యక్తి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డాడు. ఇతని మలద్వారంలో 300 గ్రాముల బరువు కలిగిన మూడు బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ తొమ్మిది లక్షల రూపాయిలు. అలాగే, చెన్నై నుంచి సింగపూర్‌కు వెళ్లిన విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన అబ్దుల్ (40) హ్యాండ్ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో అమెరికా డాలర్లు, సింగపూర్ కరెన్సీ ఉన్నట్లు తెలిసింది. వీటి విలువ రూ.15 లక్షలుగా తెలిసింది.