పారికర్‌పై అలాంటి వార్తలు ఘోరం : వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : సమాజానికి దర్పణం జర్నలిజం అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నారదుడు మొదటి జర్నలిస్టు అని చెప్పారు. లోకకళ్యాణం కోసమే జర్నలిజం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రముఖ సాహితీ వేత్త ఎన్ఆర్ చందూర్-జగతి జర్నలిస్టు అవార్డు 2018ని ప్రముఖ జర్నలిస్టు, గిజ్మోడో మీడియా గ్రూప్ సీఈవో రాజు నరిశెట్టి(అమెరికా)కు అందించిన సందర్భంగా వెంకయ్య జర్నలిజంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జర్నలిస్టులు పోరాడారని, జర్నలిజం ఒకప్పుడు మిషన్ గా ఉండేదని, ఇప్పుడు కమీషన్‌గా మారిందన్నారు. వ్యాపారం కోసం మీడియా సంస్థలు పెడుతున్నారని, ప్రజలతో గడపడంకన్నా ఆనందం మరొకటి లేదన్నారు.
తెలుగు పాత్రికేయులు నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఎవరో ఒకరు చేసిన పొరపాట్లకు దేశాన్ని అవమానించడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టడం తప్పు అని, వ్యక్తిగత అవసరాలకు, వ్యాపార విస్తరణ కు మీడియా సంస్థలు పెట్టడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికలకు కొంత స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పారు. పెద్ద కుంభకోణాలను బయటపెట్టిన ఘనత పాత్రికేయులదేని, జర్నలిజం లో విలువలు, ప్రమాణాలు పాటించాలని సూచించారు. పొరపాట్లు అంగీకరించినప్పుడే విశ్వసనీయత పెరుగుతుందని చెప్పారు. మనోహర్ పారికర్ బాగానే ఉన్నారని, కానీ, ఆయన చనిపోతే, మరొకరు సీఎం అవుతారని వార్తలు రాయడం ఘోరం అని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా మీడియా ఉండాలని సూచించారు.