చైనా టు అమరావతి: చెన్కు ఎర్రతివాచీ
విజయవాడ: ఒక విశిష్ఠ అతిథి కోసం బెజవాడ నగరం అందంగా ముస్తాబు అయింది. గన్నవరం విమానాశ్రయం నుంచి గేట్ వే హోటల్ వరకు భారత్, చైనా జాతీయ జండాలు రెపరెపలాడుతున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ శాఖ సహాయ మంత్రి చెన్ ఫింగ్స్యాంగ్.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఏవిధంగా సాగుతున్నదో పరిశీలించేందుకు సోమవారం విజయవాడకు రానున్న చెన్ యాంగ్ కు ఘనస్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఏ. బాబు ఆదివారం మీడియాకు తెలిపారు. చైనా నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న చెన్.. సోమవారం ఉదయం 8.50 గంటలకు అమరావతి చేరుకుంటారు. అక్కడి నుంచి గేట్ వే హోటల్ కు చేరుకుని 10.20 వరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో భేటీ అవుతారు. 10.30కు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుస్తారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు సీఎం, మంత్రులు, ఇతర అధికారులతో జరిగే కీలక సమావేశంలో చెన్ ఫింగ్స్యాంగ్ పాల్గొంటారు. అనంతరం మద్యాహ్నం మూడు గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అమరావతికి చేరుకుంటారు. నూతన రాజధాని ప్రాంతంలోని గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లను చెన్ పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి హోటల్ కు చేరుకుని రాత్రి అక్కడే బసచేసి మంగళవారం ఉదయం 8:15 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.