చుట్టూ నీళ్లు.. సాయం కోసం 9 గంటల పాటు కేకలు
చెన్నై: రిటైర్డ్ లెప్టినెంట్ కల్నల్ జీ వెంకటేషన్, ఆయన భార్య గీత చెన్నై శివార్లలోని ఓ చిన్న గృహంలో నివసిస్తున్నారు. వాళ్ల ఇల్లు అడయర్ నదికి 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. డిసెంబర్ 1కి ముందు రోజు సహచర బ్రిగేడియర్ రాజగోపాలన్‌తో కలిసి వెంకటేషన్ సాయంత్రపు నడకకు కూడా వెళ్లివచ్చారు. కానీ ఒక్కసారిగా కురిసిన వర్షాలతో డిసెంబర్ 1న రాత్రి అయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నీళ్లు ఒక్కసారిగా ఇంట్లోకి తోసుకొని వచ్చేశాయి. 12 అడుగుల లోతు నీళ్లు.. ఎటు కదలడానికీ లేదు. వెంకటేషన్, ఆయన భార్య ఓ టేబుల్‌పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేశారు. టేబుల్ మీద బిక్కుబిక్కుమని గడుపుతూ దాదాపు తొమ్మిది గంటలపాటు సాయం కోసం అర్థించారు. తమను రక్షించాలని కేకలు పెట్టారు.
కానీ వారిని కాపాడేందుకు ఎవరూ సాహసించలేదు. అందుబాటులో చిన్న పడవులున్నా.. 12 అడుగుల లోతు వరకు వచ్చిన నీళ్లలో వెళ్లి వారిని కాపాడటం సాధ్యపడలేదు. 9 గంటలపాటు ప్రాణాల కోసం పోరాడిన ఆ దంపతులు చివరకు నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచారని బ్రిగేడియర్ రాజగోపాలన్ తెలిపారు. సాయం కోసం తమ అల్లుడికి వారు ఫోన్ చేశారని, వరదనీళ్లలో ఇంటివరకు అతను రాలేకపోయాడని చెప్పారు. తమ ఇంటికి చేరువగా ఉన్న అడయర్ నదిలోకి సెంబత్రబాకం సరస్సు నుంచి 18వేల క్యూసెక్కులు నీళ్లు వదిలినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే అంతకుమించి ఎక్కువస్థాయిలో సరస్సు నీళ్లు విడువటం వల్ల నదికి ఎగువప్రాంతంలో ఉన్న తమ ఇల్లు మునిగిపోయి ఉంటుందని, ఆ స్థాయిలో వరద ఉధృతి ఉంటుందని తామెప్పుడు భావించలేదని ఆ దంపతుల కూతురు నిత్యశ్రీ తెలిపారు. చెన్నైని అతలాకుతలం చేసిన వరదల్లో మొత్తం 347మంది చనిపోయిన సంగతి తెలిసిందే.