‘ఫ్యాన్’ స్పీడ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ‘ఫ్యాన్’గాలి ఊపందుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టేవారు. దీంతో చేవెళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొండా రాఘవరెడ్డికి ప్రజల మద్దతు పెరుగుతోంది. వైఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల కు వివరిస్తుండడం.. ఆ పార్టీ మేనిఫెస్టోను విశదీకరించడంతో మంచి స్పందన కనిపిస్తోంది.
ప్రచార హోరు..
చేవెళ్ల లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఈసారి సొంత నియోజకవర్గానికి మారారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఎదుర్కొంటున్న జైపాల్ ఈ సారి ఓటమి భయంతో వలస వెళ్లారనే ప్రచారం సాగుతోంది. తాజాగా వైఎస్సార్సీపీ నుంచి పోటీచేస్తున్న కొండా రాఘవరెడ్డి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటుండడం, నిత్యం ప్రజల్లో కనిపించే వ్యక్తి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. మరోవైపు ఇక్కడ వైఎస్సార్ తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ కావడం ఆయనకు కలిసొచ్చే మరో అంశం. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో ఆయనకు మంచి స్పందన వ స్తోంది. తనను గెలిపిస్తే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసకు తీసుకెళ్తానని కొండా రాఘవరెడ్డి స్పష్టం చేస్తున్నారు.