'తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్న ఢిల్లీ'
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ప్రశ్నించారు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. చచ్చిపోయిన తెలంగాణ ఉద్యమానికి చిదంబరం ప్రకటనతో మళ్లీ జీవం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ నుంచే ప్రాణం పోస్తున్నారని ఆరోపించారు.
సమైక్య రాష్ట్రంలో బాగా వెనుకబడ్డాం కాబట్టి తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణవాదులు తర్వాత మాట మార్చారని చెప్పారు. 1956 తర్వాత తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని శ్రీకృష్ణ కమిటీ తేల్చడంతో.. స్వయం పాలన, మనోభావాలంటూ విభజన కోరుతున్నట్టు ప్రకటించారని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే విప్లవాత్మక మార్పులు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కావూరి విమర్శించారు.