తెరమీదకు మళ్లీ వశిష్ట వారధి
ఈసారి నిర్మాణ బాధ్యతలు కేంద్రానివి
దశాబ్దాల కల నెరవేరేనా?
నరసాపురం అర్బన్ :వశిష్ట గోదావరిపై ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వంతెన నిర్మించాలనే డిమాండ్ బ్రిటీష్ కాలం నుంచీ ఉంది. ఇది గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల కోరిక. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకూ లేని విధంగా ఈ వారధికి నాలుగుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఐదుగురు ముఖ్యమంత్రులు వంతెనపై దృష్టిపెట్టారు. పనిమాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ వంతెన అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రూ.200 కోట్లతో వంతెన నిర్మాణానికి యత్నిస్తున్నట్టు సమాచారం. మరి ఈ సారైనా వంతెన నిర్మాణానికి పునాదులు పడతాయా? లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.1800 కోట్లతో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టనున్నారు. డ్రెడ్జింగ్ హార్బర్ నిధుల్లోనే రూ.200 కోట్లు ఖర్చుపెట్టి వంతెన నిర్మించాలనేది, తాజా ప్రయత్నం. ఈమేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరికి లేఖ ఇచ్చారు. డ్రెడ్జింగ్ హార్బర్ నిధులతో వశిష్ట గోదావరిపై రైల్‌కమ్ రోడ్డు వంతెన నిర్మించాలని కోరారు. దీనికి సంబంధించి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
ఎంతవరకూ సాధ్యం
నరసాపురంలో వంతెన నిర్మిస్తే, డ్రెడ్జింగ్ హార్బర్‌కు రవాణా సదుపాయం ఏర్పడుతుందని డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు స్థానిక నేతలు నివేదికలు ఇచ్చారు. అయితే ఇప్పటికే నరసాపురానికి 15 కిలోమీటర్లు దూరంలో యలమంచిలి మండలం చించినాడ వద్ద గోదావరిపై వంతెన ఉన్న నేపథ్యంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇక్కడ మరో వంతెనకు రూ.200కోట్లు ఖర్చుచేస్తుందా? అనేది ప్రశ్న. అయితే పెరవలి నుంచి నరసాపురం వరకూ ఫోర్‌లైన్ రోడ్లు, నరసాపురం తీరంలో హార్బర్ నిర్మాణ ప్రతిపాదనలు చాలాకాలంగా ఉన్నాయి. దీంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా నరసాపురంలో వంతెన నిర్మాణం జరుగుతుందనేది అధికారుల మాట. ఇంకోవైపు స్వయంగా ముఖ్యమంత్రే కోరారు కాబట్టి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఒప్పుకోవడం అనేది లాంఛనమేనని చెబుతున్నారు. ఇది ఏ మేరకు ముందుకెళ్తుందనేది వేచిచూడాలి.
దశాబ్దాల వేదన
నరసాపురం వశిష్ట వంతెన నిర్మాణాన్ని బ్రిటీష్ హయాంలోనే చేపట్టాలని యోచించారు. అయితే అప్పుడు సాధ్యం కాలేదు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీరామారావు హయాంలో వంతెన నిర్మించాలనే నిర్ణయానికి బీజం పడింది. 1986లో ఎన్టీఆర్ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరిజిల్లాలోనూ శంకుస్థాపన చేశారు. అయితే సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. అప్పటిలో వంతెన తరలించవద్దంటూ పెద్ద ఉద్యమమే సాగింది. ఇక అప్పటి నుంచీ నరసాపురం వంతెన కథ సాగుతూనే ఉంది. 2003లోనూ అప్పడు రాష్ట్ర మంత్రిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటిలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ వంతెన నిర్మాణ యత్నాలు జరిగాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో కూడా వంతెన అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది.
వైఎస్ మృతితో ఆగిన వంతెన
నరసాపురం వశిష్ట వంతెనకు ఎందరు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని శంకుస్థాపనలు చేసినా.. ఈ విషయంలో చొరవ చూపింది మాత్రం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆయన పాదయాత్రల సమయంలో తీరంలో పర్యటించినప్పుడు, వంతెన అవసరాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఆయన రెండవసారి అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టారు. 2008 ఏప్రిల్ 15న వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. అక్కడితో సరిపెట్టకుండా రూ.194 కోట్లతో నిర్మాణ పనులను మైటాస్ కంపెనీకి అప్పగించారు. సర్వేలన్నీ పూర్తై ఇక వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థకు చెందిన మైటాస్ కంపెనీ సంక్షోభంలో కూరుకుపోవడంతో పనులు నిలిచాయి. దీంతో వేరే కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలోనే ఆయన ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలవడంతో వంతెన నిర్మాణం సాధ్యం కాలేదు. ఆ తర్వాత మైటాస్ వద్ద సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధపెట్టలేదు. దీంతో వంతెన పనులు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణానికి వై.ఎస్. హయాంలో మైటాస్ సంస్థ, ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన నివేదికలనే.. ప్రస్తుతం యథాతథంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు అందించడం విశేషం.