Chief Minister O Panneerselvam
-
సచివాలయానికి పన్నీర్ సెల్వం
l7 రోజుల తర్వాత సీఎం చాంబర్‌కు ∙పూలజల్లుతో కార్యకర్తల స్వాగతం టీనగర్: ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం సచివాలయానికి చేరుకున్నారు. తన పదవికి రాజీనామా చేసిన వారం తర్వాత సీఎం చాంబర్లో అడుగుపెట్టారు. ఆయనకు నివాసం వద్ద కార్యకర్తలు పువ్వులు చల్లి ఘనంగా స్వాగతం పలికారు. సీఎం పన్నీర్‌సెల్వం గత ఐదో తేదీన సచివాలయానికి వచ్చారు. తర్వాత ఎన్నూర్ తీరాన సముద్రంలో చమురు తెట్టు తొలగింపు పనులను పర్యవేక్షించారు. ఆ తర్వాత మళ్లీ సచివాలయం చేరుకుని అధికారులతో సమీక్షించారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా పోయెస్‌గార్డెన్ చేరుకుని తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏడో తేదీ రాత్రి జయలలిత సమాధి వద్దకు వెళ్లి కొంత సేపు ధ్యానం చేశారు. 40 నిమిషాల తర్వాత తనను బెదిరించి రాజీనామా చేయించారని, రాజీనామా వాపసు తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ప్రస్తు తం ఆయనకు పలువురి మద్దతు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కిడ్నాప్‌నకు గురై కువత్తూరులో నిర్బం ధించబడినట్లు ఫిర్యాదులందాయి. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే రాజేంద్రన్‌లను పిలిపించి ఓపీఎస్ ఉత్తర్వులిచ్చారు. మళ్లీ సచివాలయానికి రాక ఏడు రోజుల విరామం తర్వాత మళ్లీ సచివాలయానికి సోమవారం ఉదయం రానున్నట్లు ఓ.పన్నీర్ సెల్వం ప్రకటించారు. అదే సమయంలో సచివాలయానికి ప్రతిపక్ష నేత స్టాలిన్ చేరకున్నారు. ఈ విషయం గ్రహించిన ఓపీఎస్ సచివాలయం నుంచి స్టాలిన్ వెళ్లినట్లు తెలుసుకున్నంతనే మధ్యాహ్నం 12.50 గంటలకు ఇంటి నుంచి బయల్దేరారు. సాధారణంగా జయలలిత ఇంటి నుంచి బయల్దేరే సమయంలో మహిళలు హారతి పట్టడం, గుమ్మడికాయలు పగలగొట్టడం, పువ్వులు చల్లడం చేస్తుంటారు. అదే విధంగా సోమవారం ఓపీఎస్‌కు ఏర్పాట్లు జరిగాయి. కార్యకర్తలు ఆయన కారుపై పువ్వులు చల్లి స్వాగతం పలికారు. మంత్రి పాండ్యరాజన్, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో ఇంటి నుంచి బయల్దేరారు. సచివాలయానికి 1.05 గంటలకు చేరుకున్నారు. అక్కడ అధికారులు ఆయన్ను స్వాగతించలేదు. నేరుగా తన చాంబర్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. రాజీనామా చేసిన ఒక వారం తర్వాత ఓపీఎస్ సచివాలయానికి రావడం తీవ్ర సంచలనం కలిగించింది. ఓపీఎస్‌కు మరికొందరి మద్దతు: పన్నీర్ సెల్వంకు మాజీ మంత్రి మోహన్ మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన తర్వాత ఓ.పన్నీర్ సెల్వం వైపునకు పలువురు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అదే విధంగా ఎంజీఆర్, జయలలిత మంత్రివర్గంలో ఉన్న విజయలక్ష్మి పళనిసామి ఓ.పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సహాయకుడు పొన్రాజ్ మద్దతు తెలిపారు. ఇలావుండగా గ్రీన్‌వేస్ రోడ్డులోని ఓ.పన్నీర్‌సెల్వం నివాసం ముందు కార్యకర్తలు, అభిమానులు వెల్లువెత్తారు. దీంతో అక్కడ భారీ పోలీసు భద్రత కల్పించారు. ఓపీఎస్ జట్టులో ఆ ఏడుగురు: పన్నీర్‌సెల్వం జట్టులో ఏడుగురు నేతలు బలోపేతం చేస్తున్నారు. పన్నీర్‌సెల్వంకు పలువురిమద్దతు కూడగట్టేందుకు వీరు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరిలో కేపీ మునుసామి, ఎంపీ మైత్రేయన్, మాఫా పాండ్యరాజన్, నత్తం విశ్వనాథన్, పీహెచ్ పాండ్యన్, మధుసూదనన్, సీ.పొన్నయన్ ఉన్నారు. -
కొత్త వ్యూహమా?
శ్రీరంగం ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులంతా వెంటనే చెన్నై చేరుకోవాలంటూ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన ఫోన్‌కాల్ కలకలం సృష్టించింది. ఉప ఎన్నికలో గెలుపుకోసం కొత్త వ్యూహ రచనకే అని ప్రతిపక్ష పార్టీలు ఊహాగానాల్లో మునిగిపోయాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి :అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన శ్రీరంగం అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, సీపీఎం బరిలో దిగాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే సాగుతోంది. గతంలో అన్నాడీఎంకే ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో సిట్టింగ్ సీటును దక్కించుకోవడం అధికార పార్టీకి ప్రతిష్టగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలై ప్రతిష్ట కోల్పోయిన జయలలితను మరింతగా దెబ్బతీసేందుకు శ్రీరంగం ఎన్నికలను డీఎంకే అవకాశంగా తీసుకుంది. తమ రాజకీయ ప్రతిష్టను పెంచగల శ్రీరంగంలో విజయం డీఎంకే ఎంతో అవసరంగా భావిస్తోంది. రెండు పార్టీల మధ్య పోటీ ప్రతిష్టాత్మకంగా మారడంతో సిట్టింగ్ సీటును దక్కించుకోవడం కోసం 29 మంది మంత్రులు మూడువారాలుగా శ్రీరంగంలో తిష్టవేశారు. నియోజకవర్గాన్ని విభజించుకుని ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 11వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగిసేవరకు చెన్నైకి రావద్దని అమ్మ గతంలో ఆదేశించింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే గెలుపు నల్లేరుపై నడకగా భావించిన పరిస్థితులు క్రమేణా మారిపోతున్నాయి. డీఎంకే అభ్యర్థి ఆనంద్ గతంలో అమ్మపై పోటీచేసి ఓడిపోయిన సానుభూతి, సామాజిక పరంగా బలమైన అభ్యర్థి కావడంతో గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పరిణామం అధికార పార్టీ నేతల కంటిపై కనుకులేకుండా చేసింది. ఈనెల 13న పోలింగ్ సందర్భంగా పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఇటువంటి కీలకసమయంలో గురువారం రాత్రి కల్లా మంత్రులను ఆగమేఘాలపై చెన్నైకి చేరుకోవాలని ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆదేశించారు. బుధవారం సాయంత్రం పోయెస్‌గార్డెన్‌లో జయలలితతో సమావేశమైన అనంతరం పన్నీర్ సెల్వం మంత్రులకు ఫోన్ చేయడం వల్ల ఇది అమ్మ ఆదేశంగా ప్రచారంలో ఉంది. కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సీఎంగా జయలలిత మంత్రులతో సమావేశం కావడం ఆనవాయితీ. అయితే పన్నీర్ సెల్వం సీఎం అయిన ఈ నాలుగు నెలల్లోఇంత వరకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించలేదు. మంత్రులతో శుక్రవారం కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేందుకే ఈ పిలుపుగా భావిస్తున్నారు. అలాగే శ్రీరంగంలో అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు అవకాశాలు మందగించడం వల్ల ప్రచార వ్యూహంలో ఏమైనా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందంటున్నారు. అంతేగాక ఈనెల 23నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయంతోనే మంత్రులను రప్పించినట్లు భావిస్తున్నారు. -
ధైర్యముంటే రండి
సాక్షి, చెన్నై:నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి రండి అని డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సవాల్ విసిరారు. ఎలాంటి చర్చలకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తీరును దుయ్యబడుతూ కరుణానిధి, డీఎంకే కోశాధికారి స్టాలిన్లు విమర్శల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. పన్నీరు లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం పెరిగింది. ఈ నేపథ్యంలో పన్నీరుకు కోపం వచ్చినట్లుంది. కరుణ, స్టాలిన్‌పై ఎదురుదాడికి దిగుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరుణానిధి, ఆయన తన యుడు స్టాలిన్ మర్యాదను మరచి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి నాగరికత ఏమిటో తనకు తెలియదనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని సమావేశపరచాలని వారు డిమాండ్ చేస్తే తానేదో స్పందించినట్టుగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీలో తాము నాగరికంగా వ్యవహరించడం లేదని కరుణానిధి ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని పేర్కొన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు ప్రపంచానికే తెలియనిది కాదన్నారు. తిరువారూర్ నుంచి ఎన్నికైన కరుణానిధి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా సంతకాలకే పరిమితం అయ్యూరన్నారు. ఆయనకు అక్కడి ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో దీనినిబట్టే అర్థమవుతోందని తెలిపారు. సొంత నియోజకవర్గం సమస్యలపై దృష్టి పెట్టని ఆయన ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద ఏ మేరకు స్పందిస్తారని ప్రశ్నించారు. జనం మరువలేదు కరుణానిధి తమ అధినేత్రి, అమ్మ జయలలితను కించ పరిచే రీతిలో గతంలో ఏ విధంగా వ్యవహరించారో ప్రజలు మరచిపోలేదని పన్నీరు సెల్వం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడమే కాకుండా నింద మోపి తమను సస్పెండ్ చేరుుంచలేదా అని పేర్కొన్నారు. డీఎంకే సభ్యులు ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలుసునన్నారు. నిజంగా చిత్తశుద్ధి, ప్రజలపై గౌరవం ఉంటే సభకు ఆటకం కలిగించకుండా వ్యవహరించాలని హితవు పలికారు. అమ్మ ప్రభుత్వం ప్రజల కోసం శ్రమిస్తుంటే, పనిగట్టుకుని సభ నుంచి వాకౌట్ల రూపంలో బయటకు వెళ్లడం డీఎంకేకు పరిపాటిగా మారిందని మండి పడ్డారు. కరుణకు ధైర్యముంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని హితవు పలికారు. డీఎంకే ఎత్తి చూపే అంశాలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. -
పాలపై రూ.10 భారం
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఆవిన్ పాల ధరపై ప్రభుత్వం రూ.10 అదనపు భారం మోపింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి లీటరు రూ.34 లెక్కన అమ్మనున్నట్లు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం శనివారం ప్రకటించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పాల సేకరణ ధరను కూడా పెంచాలని పాల ఉత్పత్తిదారుల సమాఖ్య కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. దీంతో సేకరణ ధరపై రూ.5 పెంచి, అమ్మకంపై రూ.10 పెంచుతూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ వ్యవసాయదారులకు పాల ఉత్పత్తి ప్రధాన ఆదాయవనరుగా ఉందని చెప్పారు. గత డీఎంకే ప్రభుత్వం ఈ వాస్తవాన్ని విస్మరించి ఆవిన్ సంస్థను ఆర్థిక ఊబిలోకి నెట్టివేసిందని విమర్శించారు. రైతుల నుంచి సేకరించిన పాలకు 45 రోజుల తరువాత కూడా చెల్లింపులు ఇవ్వలేని దుర్భర స్థితికి ఆవిన్ సంస్థ చేరుకుందన్నారు. ఆవిన్ సంస్థ సైతం పాల సేకరణను కుదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. జయలలిత అధికారంలోకి వచ్చిన తరువాత నెలకు రూ.17 కోట్ల చొప్పున ఆరు నెలల పాటు ఆర్థిక సహకారం అందించారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందిన రూ.192 కోట్ల ఆవిన్ ఆర్థికంగా బలపడిందన్నారు. ఆవిన్ బాగుపడింది, రైతులను కూడా ఆదుకోండనే విజ్ఞప్తులను స్వీకరించినట్లు సీఎం చెప్పారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి 1 నుంచి సేకరణ ధరను లీటరుకు రూ.3 పెంచినట్లు చెప్పారు. అయితే ఆనాడు సేకరణ ధరను పెంచినా అమ్మకం ధర పెంచలేదని గుర్తు చేశారు. పశువుల, దాణా ధరలు పెరగడం, పాడిరైతుల పెంపకంలో రైతుల ఖర్చులు ఆకాశాన్ని అంటడంతో సేకరణ ధరను మరోసారి పెంచామని తెలిపారు. ఆవుపాలు సేకరణ ధర లీటరుకు రూ.23 నుంచి 28, గేదెపాలు లీటరుకు రూ.31 నుంచి 35కు పెంచుతూ నిర్ణయించినట్లు చెప్పారు. అంటే ఆవుపాలు సేకరణపై రూ.5, గేదెపాలు సేకరణపై రూ.4 పెంచినట్లు తెలిపారు. సేకరణ ధర పెంచిన భారాన్ని తట్టుకునేందుకు ఆవిన్ పాల అమ్మకంలో సైతం లీటరుకు రూ.24 నుంచి రూ.34కు పెంచక తప్పలేదని సీఎం చెప్పారు. కరుణ ఖండన ఏ ప్రభుత్వ చరిత్రలోనూ పాల ధరపై ఒకేసారి రూ.10 భారం మోపడం జరగలేదని డీఎంకే అధినేత కరుణానిధి విమర్శించారు. ఆవిన్ పాల అమ్మకాల్లో సాగిన కోట్లాది రూపాయల కుంభకోణం ఇటీవల బట్టబయలైందని, ఈ లోటును పూడ్చుకునేందుకు ప్రజలపై భారం మోపారని ఆయన దుయ్యబట్టారు. పెంచిన పాల అమ్మకాల ధరను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.