సచివాలయానికి పన్నీర్ సెల్వం
l7 రోజుల తర్వాత సీఎం చాంబర్‌కు
∙పూలజల్లుతో కార్యకర్తల స్వాగతం
టీనగర్: ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం సచివాలయానికి చేరుకున్నారు. తన పదవికి రాజీనామా చేసిన వారం తర్వాత సీఎం చాంబర్‌లో అడుగుపెట్టారు. ఆయనకు నివాసం వద్ద కార్యకర్తలు పువ్వులు చల్లి ఘనంగా స్వాగతం పలికారు. సీఎం పన్నీర్‌సెల్వం గత ఐదో తేదీన సచివాలయానికి వచ్చారు. తర్వాత ఎన్నూర్ తీరాన సముద్రంలో చమురు తెట్టు తొలగింపు పనులను పర్యవేక్షించారు. ఆ తర్వాత మళ్లీ సచివాలయం చేరుకుని అధికారులతో సమీక్షించారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా పోయెస్‌గార్డెన్ చేరుకుని తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏడో తేదీ రాత్రి జయలలిత సమాధి వద్దకు వెళ్లి కొంత సేపు ధ్యానం చేశారు. 40 నిమిషాల తర్వాత తనను బెదిరించి రాజీనామా చేయించారని, రాజీనామా వాపసు తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ప్రస్తు తం ఆయనకు పలువురి మద్దతు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కిడ్నాప్‌నకు గురై కువత్తూరులో నిర్బం ధించబడినట్లు ఫిర్యాదులందాయి. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే రాజేంద్రన్‌లను పిలిపించి ఓపీఎస్ ఉత్తర్వులిచ్చారు.
మళ్లీ సచివాలయానికి రాక
ఏడు రోజుల విరామం తర్వాత మళ్లీ సచివాలయానికి సోమవారం ఉదయం రానున్నట్లు ఓ.పన్నీర్ సెల్వం ప్రకటించారు. అదే సమయంలో సచివాలయానికి ప్రతిపక్ష నేత స్టాలిన్ చేరకున్నారు. ఈ విషయం గ్రహించిన ఓపీఎస్ సచివాలయం నుంచి స్టాలిన్ వెళ్లినట్లు తెలుసుకున్నంతనే మధ్యాహ్నం 12.50 గంటలకు ఇంటి నుంచి బయల్దేరారు. సాధారణంగా జయలలిత ఇంటి నుంచి బయల్దేరే సమయంలో మహిళలు హారతి పట్టడం, గుమ్మడికాయలు పగలగొట్టడం, పువ్వులు చల్లడం చేస్తుంటారు.
అదే విధంగా సోమవారం ఓపీఎస్‌కు ఏర్పాట్లు జరిగాయి. కార్యకర్తలు ఆయన కారుపై పువ్వులు చల్లి స్వాగతం పలికారు. మంత్రి పాండ్యరాజన్, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో ఇంటి నుంచి బయల్దేరారు. సచివాలయానికి 1.05 గంటలకు చేరుకున్నారు. అక్కడ అధికారులు ఆయన్ను స్వాగతించలేదు. నేరుగా తన చాంబర్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. రాజీనామా చేసిన ఒక వారం తర్వాత ఓపీఎస్ సచివాలయానికి రావడం తీవ్ర సంచలనం కలిగించింది.
ఓపీఎస్‌కు మరికొందరి మద్దతు: పన్నీర్ సెల్వంకు మాజీ మంత్రి మోహన్ మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన తర్వాత ఓ.పన్నీర్ సెల్వం వైపునకు పలువురు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అదే విధంగా ఎంజీఆర్, జయలలిత మంత్రివర్గంలో ఉన్న విజయలక్ష్మి పళనిసామి ఓ.పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సహాయకుడు పొన్‌రాజ్ మద్దతు తెలిపారు. ఇలావుండగా గ్రీన్‌వేస్ రోడ్డులోని ఓ.పన్నీర్‌సెల్వం నివాసం ముందు కార్యకర్తలు, అభిమానులు వెల్లువెత్తారు. దీంతో అక్కడ భారీ పోలీసు భద్రత కల్పించారు.
ఓపీఎస్ జట్టులో ఆ ఏడుగురు: పన్నీర్‌సెల్వం జట్టులో ఏడుగురు నేతలు బలోపేతం చేస్తున్నారు. పన్నీర్‌సెల్వంకు పలువురిమద్దతు కూడగట్టేందుకు వీరు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరిలో కేపీ మునుసామి, ఎంపీ మైత్రేయన్, మాఫా పాండ్యరాజన్, నత్తం విశ్వనాథన్, పీహెచ్ పాండ్యన్, మధుసూదనన్, సీ.పొన్నయన్ ఉన్నారు.