ఆవిన్ పాల ధరపై ప్రభుత్వం రూ.10 అదనపు భారం మోపింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి లీటరు రూ.34 లెక్కన అమ్మనున్నట్లు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం శనివారం ప్రకటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఆవిన్ పాల ధరపై ప్రభుత్వం రూ.10 అదనపు భారం మోపింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి లీటరు రూ.34 లెక్కన అమ్మనున్నట్లు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం శనివారం ప్రకటించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పాల సేకరణ ధరను కూడా పెంచాలని పాల ఉత్పత్తిదారుల సమాఖ్య కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. దీంతో సేకరణ ధరపై రూ.5 పెంచి, అమ్మకంపై రూ.10 పెంచుతూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ వ్యవసాయదారులకు పాల ఉత్పత్తి ప్రధాన ఆదాయవనరుగా ఉందని చెప్పారు. గత డీఎంకే ప్రభుత్వం ఈ వాస్తవాన్ని విస్మరించి ఆవిన్ సంస్థను ఆర్థిక ఊబిలోకి నెట్టివేసిందని విమర్శించారు. రైతుల నుంచి సేకరించిన పాలకు 45 రోజుల తరువాత కూడా చెల్లింపులు ఇవ్వలేని దుర్భర స్థితికి ఆవిన్ సంస్థ చేరుకుందన్నారు. ఆవిన్ సంస్థ సైతం పాల సేకరణను కుదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
జయలలిత అధికారంలోకి వచ్చిన తరువాత నెలకు రూ.17 కోట్ల చొప్పున ఆరు నెలల పాటు ఆర్థిక సహకారం అందించారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందిన రూ.192 కోట్ల ఆవిన్ ఆర్థికంగా బలపడిందన్నారు. ఆవిన్ బాగుపడింది, రైతులను కూడా ఆదుకోండనే విజ్ఞప్తులను స్వీకరించినట్లు సీఎం చెప్పారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి 1 నుంచి సేకరణ ధరను లీటరుకు రూ.3 పెంచినట్లు చెప్పారు. అయితే ఆనాడు సేకరణ ధరను పెంచినా అమ్మకం ధర పెంచలేదని గుర్తు చేశారు. పశువుల, దాణా ధరలు పెరగడం, పాడిరైతుల పెంపకంలో రైతుల ఖర్చులు ఆకాశాన్ని అంటడంతో సేకరణ ధరను మరోసారి పెంచామని తెలిపారు. ఆవుపాలు సేకరణ ధర లీటరుకు రూ.23 నుంచి 28, గేదెపాలు లీటరుకు రూ.31 నుంచి 35కు పెంచుతూ నిర్ణయించినట్లు చెప్పారు. అంటే ఆవుపాలు సేకరణపై రూ.5, గేదెపాలు సేకరణపై రూ.4 పెంచినట్లు తెలిపారు. సేకరణ ధర పెంచిన భారాన్ని తట్టుకునేందుకు ఆవిన్ పాల అమ్మకంలో సైతం లీటరుకు రూ.24 నుంచి రూ.34కు పెంచక తప్పలేదని సీఎం చెప్పారు.
కరుణ ఖండన
ఏ ప్రభుత్వ చరిత్రలోనూ పాల ధరపై ఒకేసారి రూ.10 భారం మోపడం జరగలేదని డీఎంకే అధినేత కరుణానిధి విమర్శించారు. ఆవిన్ పాల అమ్మకాల్లో సాగిన కోట్లాది రూపాయల కుంభకోణం ఇటీవల బట్టబయలైందని, ఈ లోటును పూడ్చుకునేందుకు ప్రజలపై భారం మోపారని ఆయన దుయ్యబట్టారు. పెంచిన పాల అమ్మకాల ధరను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.