నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి రండి అని డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సవాల్ విసిరారు.
సాక్షి, చెన్నై:నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి రండి అని డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సవాల్ విసిరారు. ఎలాంటి చర్చలకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తీరును దుయ్యబడుతూ కరుణానిధి, డీఎంకే కోశాధికారి స్టాలిన్‌లు విమర్శల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. పన్నీరు లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం పెరిగింది. ఈ నేపథ్యంలో పన్నీరుకు కోపం వచ్చినట్లుంది. కరుణ, స్టాలిన్‌పై ఎదురుదాడికి దిగుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరుణానిధి, ఆయన తన యుడు స్టాలిన్ మర్యాదను మరచి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
వీరి నాగరికత ఏమిటో తనకు తెలియదనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని సమావేశపరచాలని వారు డిమాండ్ చేస్తే తానేదో స్పందించినట్టుగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీలో తాము నాగరికంగా వ్యవహరించడం లేదని కరుణానిధి ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని పేర్కొన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు ప్రపంచానికే తెలియనిది కాదన్నారు. తిరువారూర్ నుంచి ఎన్నికైన కరుణానిధి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా సంతకాలకే పరిమితం అయ్యూరన్నారు. ఆయనకు అక్కడి ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో దీనినిబట్టే అర్థమవుతోందని తెలిపారు. సొంత నియోజకవర్గం సమస్యలపై దృష్టి పెట్టని ఆయన ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద ఏ మేరకు స్పందిస్తారని ప్రశ్నించారు.
జనం మరువలేదు
కరుణానిధి తమ అధినేత్రి, అమ్మ జయలలితను కించ పరిచే రీతిలో గతంలో ఏ విధంగా వ్యవహరించారో ప్రజలు మరచిపోలేదని పన్నీరు సెల్వం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడమే కాకుండా నింద మోపి తమను సస్పెండ్ చేరుుంచలేదా అని పేర్కొన్నారు. డీఎంకే సభ్యులు ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలుసునన్నారు. నిజంగా చిత్తశుద్ధి, ప్రజలపై గౌరవం ఉంటే సభకు ఆటకం కలిగించకుండా వ్యవహరించాలని హితవు పలికారు. అమ్మ ప్రభుత్వం ప్రజల కోసం శ్రమిస్తుంటే, పనిగట్టుకుని సభ నుంచి వాకౌట్ల రూపంలో బయటకు వెళ్లడం డీఎంకేకు పరిపాటిగా మారిందని మండి పడ్డారు. కరుణకు ధైర్యముంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని హితవు పలికారు. డీఎంకే ఎత్తి చూపే అంశాలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని ప్రకటించారు.