చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న డీఎంకే సంస్థాగతంగా ప్రక్షాళన పనిలో పడింది. కోల్పోయిన జవసత్వాలను కూడగట్టేందుకు వచ్చేనెల 2వ తేదీన సమాయుత్తం అవుతోంది. డీఎంకేలో చీలికతెచ్చి అన్నాడీఎంకే అధినేతగా అవతరించిన ఎంజీ రామచంద్రన్ నాటికంటే జయలలితతోనే డీఎంకేకు చేదుఅనుభవాలు ఎదురవుతున్నాయి. తమిళనాడులో అత్యంత సమ్మోహనాశక్తి కలి గిన ఎంజీ రామచంద్రన్ కంటే అధికస్థాయిలో జయ ఓటర్లను ఆకర్షించడం డీఎంకే నేతలకు మింగుడుపడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి, యూపీఏతో తెగదెంపులు, అవినీతి అక్రమాల ఆరోపణలు, సీబీఐ కేసులతో కృంగిపోయి ఉన్న డీఎంకే లోక్‌సభ ఎన్నికలు చావుదెబ్బతీశాయని చెప్పవచ్చు. 37 స్థానాలను అమ్మ తన్నుకుపోగా, దేశ వ్యాప్తంగా ఊపు మీదున్న బీజేపీ కూటమి ఇక్కడ రెండు దక్కించుకుంది.
క్షేత్రస్థాయిలో పోస్టుమార్టం
డీఎంకే ఓటమికి తగిన కారణాలను అన్వేషిస్తూ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి పోస్ట్‌మార్టం మొదలుపెట్టారు. పొత్తులతో బలమైన కూటమి లేకపోవడం, జిల్లా స్థాయి కేడర్ నిర్లక్ష్యం, పార్టీలో ముఠా తగాదాలు, అభ్యర్థులకు సహాయ నిరాకరణ వంటి అనేక కారణాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఊరికే అంచనాలు వేసుకునేకంటే నిర్దిష్టమైన కారణాలను కనుగొనాలని డీఎంకే ఆశిస్తోంది. ఇందుకోసం 24 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకుంది. కరుణానిధి, స్టాలిన్ తదితర అగ్రనేతలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వచ్చేనెల 2వ తేదీన డీఎంకే కేంద్ర కార్యాలయమైన అన్నాఅరివాలయంలో సమావేశం కానుంది. మొత్తం 39 నియోజకవర్గాల్లో 7చోట్ల 3వ స్థానం, 2 చోట్ల 4వ స్థానంలోకి డీఎంకే దిగజారింది. ఇందుకు దారితీసిన కారణాలను అన్వేషిస్తోంది. పార్టీ గెలుపునకు పనిచేయని జిల్లా అధ్యక్షులను గుర్తించి కొత్తవారిని నియమించాలని నిర్ణయానికి వచ్చింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవడంతోపాటూ ఆరోపణల తీవ్రతను బట్టి బహిష్కరించాలని భావిస్తోంది.
డీఎంకే ప్రక్షాళన
Published Wed, May 21 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement