కరుణ విసుర్లు!
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడ్ని చూసినా.. అధికార పగ్గాలు తమవేనని, ‘సీఎం’ కాబోతున్నామంటూ ఆశతో పల్లకిలో ఊగిసలాడుతున్నారంటూ డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఎద్దేవా చేశా రు. ప్రతిపక్ష పార్టీలపై సెటైర్లు విసురుతూ గురువారం ఆయన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేలు అతి పెద్ద పార్టీలు. ఇన్నాళ్లు ఈ రెండు పార్టీలే మార్చి మార్చి అధికారంలోకి వస్తున్నాయి. జాతీయ, రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఈ రెండు పార్టీల గొడుగు నీడన చేరాల్సింది. అయితే, ఈసారి ఎవరికి వారు అన్నట్టుగా ప్రతి పక్షాలు అధికారం ఆశలతో ఉరకలు తీస్తున్నాయి. మార్పు నినాదంతో పీఎంకే అధినేత రాందాసు తన తనయుడి అన్భుమణిని సీఎం చేయాలన్న ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్నారు.
ఇక, తానే తదుపరి సీఎం అన్నట్టుగా ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎండీకే అధినేత విజయకాంత్ సంక్షేమ పథకాల పంపిణీ నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఇక, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలు, ఎంఎంకేలు ఒకే వేదికగా పయనం సాగిస్తూ అధికారం తమేదేనని జబ్బలు చరిచే పనిలో పడ్డాయి. ఇక జాతీయ పార్టీలు బీజేపీ , కాంగ్రెస్ సైతం వేర్వేరుగా ఒంటరి పయనం సాగించి, తమ పార్టీకి చెందిన వారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే వ్యూహాలతో ఉన్నాయి. ఇలా ప్రతి పక్ష పార్టీలన్నీ అధికార తమదేనని, కాబోయే సీఎంలు తామంటే తామేనన్న ఆశల పల్లకీలో ఊగిసలాడుతుండటంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందించారు. రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న కరుణానిధికి ప్రతి పక్షాల తీరు ఆగ్రహాన్ని తెప్పించినట్టుంది. అందుకే ఓ ప్రకటనలో విమర్శలు కురిపించారు.
అందరిదీ ‘సీఎం’ ఆశే :రాష్ట్రంలోని పార్టీల తీరు చూస్తుంటే, హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కొన్ని పార్టీలు తాము అధికారంలోకి వచ్చేసినట్టు, సీఎం కుర్చీలో కూర్చోబోతున్నట్టుగా వ్యాఖ్యలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు. రాష్ర్టంలో అద్వాన పాలన సాగుతున్నదని, ప్రజలకు ఈ ప్రభుత్వంతో ఒరిగిందేమి లేదని ఆరోపిస్తూ చిట్టా విప్పారు.
మంత్రులు దోపిడీ లక్ష్యంగా పయనం సాగుతున్నారని, అధికారులు ఎవరు వస్తే...పోతే..తమకేం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు ఎవరికీ పట్టడం లేదని, అందరికీ తాము బాగుంటే చాలు, తమ ఆశలు నెరవేరితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఒకరేమో అధికారంలోకి వచ్చేశాం అంటూ, మరొకరేమో తదుపరి సీఎం తానే అంటూ వ్యాఖ్యానించడం బట్టి చూస్తే, వీరందరికీ ప్రజల మీద ఏ మేరకు చిత్త శుద్ది ఉందో స్పష్టం అవుతోందన్నారు. ప్రతి పక్షాల మధ్య ఐక్యత కొరవడడంతోనే పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు అష్టకష్టాలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ధనం, పత్రికా బలం ఉంటే చాలదని, ప్రజా బలం ముఖ్యం అన్న విషయాన్ని పార్టీలు గుర్తించాలని హితవు పలికారు.
ప్రజలు మేల్కొవాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజల కోసం ఎవరు మంచి చేశారోనన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని, రాష్ట్ర ప్రయోజనాల్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ తమ నిర్ణయాన్ని తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఇక, వరికి మద్దతు ధర పేరుతో అన్నదాతల్ని మరో మారు మోసం చేస్తున్నారని మండి పడ్డారు. కంటి తుడుపు చర్యగా మద్దతు ధరను ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. కష్టాల కడలిలో ఉన్న అన్నదాతకు భరోసా ఇచ్చే విధంగా మద్దతు ధరను ప్రకటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.