వృద్ధి రేటుకు ప్రభుత్వం సైతం కోత
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇప్పటికే జీడీపీ వృద్ధి రేటుపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న క్రమంలో ప్రభుత్వం సైతం వృద్ధి అంచనాలను తగ్గించేసింది. మూడేళ్ల కనిష్ట స్థాయిలో 7.1 శాతంగా మాత్రమే 2016-17 ఆర్థికసంవత్సర వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందని ప్రభుత్వ గణాంకాలు చెప్పాయి. గణాంకాల చీఫ్ డాక్టర్ టీసీఏ అనంత్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వృద్ధి రేటు అంచనాలను ప్రకటించారు. 2015-16 లో ఈ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంది. అయితే అక్టోబర్ వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారమే ఈ అంచనాలు వెలువడ్డాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం ఈ ప్రభావం ఏ మేర ఉండొచ్చనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
పెద్ద నోట్ల రద్దుతో స్వల్పకాలంలో ఆర్థికవ్యవస్థ మందగించవచ్చని ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. పలు రేటింగ్ ఏజెన్సీలు సైతం వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించాయి. నగదు కొరత దెబ్బతో మరికొంత శాతం పాటు వృద్ధి రేటు పడిపోయే అవకాశముందని తెలుస్తోంది. స్థూల ఆదాయ విలువ(జీవీఏ) కూడా 2016-17 ఆధారిత ధర ప్రకారం 7.0 శాతంగా ఉంటుందని అంచనావేశారు. ఈ విలువ 2015-16లో 7.2 శాతంగా ఉంది. తలసరి ఆదాయంలో వృద్ధి రేటు సైతం 2016-17 కాలంలో 5.6 శాతంగా నమోదయ్యే అవకాశముందని ప్రభుత్వ గణాంకాల్లో తెలిసింది. జీవీఏలో వ్యవసాయ రంగం గతేడాది 1.2శాతం కంటే 2016-17లో మంచి వృద్ధిని 4.1 శాతంగా నమోదుచేసిందని అనంత్ చెప్పారు.