యజమానికే టోకరా
చిక్కడపల్లి (హైదరాబాద్): పనిచేసే సంస్థకే కన్నం వేసి 3.5 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడిని చిక్కడపల్లి పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య, సీఐ మంత్రి సుదర్శన్, డీఐ బాబ్జీ కేసు వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్‌కు చెందిన చేతన్ మాలిక్ మహారాష్ట్ర థానే ప్రాంతంలో వ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటుపడిన అతను మోసాలు చేయడంతో మహారాష్ట్ర రాంనగర్ పోలీస్ స్టేషన్ చీటింగ్ కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో అతను మూడు నెలల దోమలగూడ గగన్ మహల్లో వ్యాపారం చేస్తున్న తన గ్రామానికి రాజేష్ పాటిల్ వద్ద సహాయకుడిగా పనిలో చేరాడు. రాజేష్ కమీషన్ పద్దతిన వివిధ ప్రాంతాలకు బంగారం సరఫరా చేస్తుంటాడు. జనవరి 23న 3.5 కిలోల ఆభరణాలను తీసుకుని చిత్తూరు జిల్లా మదనపల్లిలో కస్టమర్‌కు అందజేసేందుకు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లిరు. యాజమాని బాత్రూమ్కు వెళ్లగా చేతన్ మాలిక్ ఆభరణాల బ్యాగ్‌తో పరారయ్యాడు. దీంతో రాజేష్ గత నెల 18న చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇన్స్పెక్టర్ మంత్రి సుదర్శన్ పర్యవేక్షణలో డీఎస్ఐ నరేందర్, హెడ్‌కానిస్టేబుల్ ఎం.డి.ఇషామొద్దీన్, కానిస్టేబుల్ సంతోష్ కుమార్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి ఉంగరాలు, చెవి దిద్దులు, లాకెట్లు, ముక్కు పుడకలను తదితర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరిగించిన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మంత్రి సుదర్శన్‌తో పాటు ప్రత్యేక బృందాన్ని ఏసీపీ అభినందించారు.