బాలకృష్ణ నామినేషన్‌కు వస్తే రూ.400 ఇస్తాం..!
సాక్షి, చిలమత్తూరు: టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ నేడు(శుక్రవారం) నామినేషన్ వేయనున్నారు. నామినేషన్‌కు అవసరమైన జనసమీకరణ కోసం మండలంలోని నాయకులు తలమునకలవుతూ నానా తంటాలు పడుతున్నట్లు స్థానికులు చర్చించుకోవడం విశేషం. నామినేషన్‌కు ప్రజలను తరలించడం కోసం ఒక్కొక్కరికి రూ.400 వరకు ఇస్తున్నట్లు సమాచారం. టీడీపీ నాయకులు ప్రజలను తరలించేందుకు పలు గ్రామాల్లో తిరగినట్లు ప్రజలు చెబుతున్నారు.
జనం వచ్చేలా చూడాలని నియోజకవర్గపు నాయకులు స్థానిక మండల నాయకులకు పనులు అప్పగించిన్నట్లు మండలంలో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం చిలమత్తూరులో నరసింహ స్వామి రథోత్సవంలో కూడా బాలయ్యను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. జనసమీకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించమని ఎమ్మెల్యే... నాయకులకు హుకుం జారీ చేసిన్నట్లు సొంత పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం.