బాలలకు రక్షణ కవచం ‘జువైనల్ యాక్ట్’
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్
విజయవాడ: సమాజంలో బాలల హక్కులను కాపాడేందుకు జువైనల్ జస్టిస్ యాక్ట్ రక్షణ కవచంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన నాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. విజయ వాడ సబ్–కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, కృష్జా జిల్లా న్యాయసేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బడుగు, బలహీన అట్టడుగు వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం చట్టాలు ఏవిధంగా ఉపయోగపడతాయో తెలపాల్సిన గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని చెప్పారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ వై.లక్ష్మణరావు మాట్లాడుతూ బాలల రక్షణ స్నేహ పూర్వక సేవల పథకం ఉద్దేశాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో వివరించారు. బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందడుగులో ఉండటం ముదావహమన్నారు.