23 రోజుల పాపకు సీపీఆర్.. ప్రాణం కాపాడిన 108 సిబ్బంది
చిన్నకోడూరు(సిద్దిపేట): పాపకు స్నానం చేయిస్తుండగా వేడి నీళ్లు మింగడంతో శ్వాస ఆగిపోయింది. 108 సిబ్బంది సీపీఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీహార్‌కు చెందిన ప్రేమ్‌నాథ్ యాదవ్, కవిత దంపతులు పనిచేస్తున్నారు. వీరికి 23 రోజుల వయసున్న బేబీ సుబ్బలక్ష్మి ఉంది.
అయితే, ఆ పాపకు స్నానం చేయిస్తుండగా వేడి నీళ్లు మింగింది. దీంతో శ్వాస ఆగిపోయింది. వెంటనే గ్రామానికి చెందిన ఏఎన్ఎం తిరుమల, ఆశావర్కర్ సుగుణ 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అశోక్, వెంకట్ అక్కడకు చేరుకుని పరీక్షించి.. బేబీ గుండె, నాడీ కొట్టుకోవడం లేదని గమనించారు. వెంటనే ఈఆర్సీపీ డాక్టర్ చక్రవర్తికి విషయం చెప్పి, ఆయన సూచనల ప్రకారం ప్రథమ చికిత్స (సీపీఆర్) చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేబీ ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని బంధువులు, హాస్పిటల్ సిబ్బంది అభినందించారు.
ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. బిడ్డ ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం అంటూ ట్విట్టర్లో కామెంట్స్ చేశారు.
సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు 💐
అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం🙏🏻
CPR Saves Lives. pic.twitter.com/tItoUzi1Vj
— Harish Rao Thanneeru (@BRSHarish) April 5, 2023