పసికందుకు ప్రాణం పోశారు..!
అనంతపురం న్యూసిటీ : 'వైద్యో నారాయణో హరి' అన్న నానుడికి మరోసారి అర్థం చెప్పారు ప్రభుత్వ సర్వజనాస్పత్రి చిన్న పిల్లల విభాగం వైద్యులు. 56 రోజుల పాటు వైద్యులు, సిబ్బంది శ్రమ ఫలితం ఓ పసికందుకు పునర్జన్మ లభించింది. చిన్న పిల్లల విభాగంలోని ఎస్‌ఎన్‌సీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ దినకర్, సిబ్బంది కృషి మరువలేనిదని ఆయనకు రుణపడి ఉంటామని పాప తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పుట్టపర్తికు చెందిన దేవిక గర్భం దాల్చిన ఆరు నెలల 10 రోజులప్పుడు బ్లీడింగ్ ఆగడం లేదని నగరంలోని ఎంఎన్‌ఆర్ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు సిజేరియన్ చేయాలని, బిడ్డకు గ్యారెంటీ లేదని చెప్పారు. భర్త నరేష్ అందుకు ఒప్పుకున్నాడు.
గత అక్టోబర్ 7న సిజేరియన్ చేయగా పాప 990 గ్రాముల బరువుతో పుట్టింది. పాప ఇన్‌ఫెక్షన్స్‌తో పాటు శరీరంతో టెంపరేచర్, గ్లూకోజ్ తగ్గిపోయాయి. పాప బతకదన్న తరుణంలో సర్వజనాస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షించిన ఎస్‌ఎన్‌సీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ దినకర్ మాట్లాడుతూ గర్భంలో 40 వారాలు ఉండాల్సిన పాప 25 వారాలకే పుట్టిందని కష్టమైన కేసు అని వివరించారు. శాయశక్తులా ప్రయత్నిస్తామని డాక్టర్ దినకర్ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి పాపను ఐసీయూలో ఉంచి ’కంగారో మదర్ కేర్ పక్రియ’ను మొదలు పెట్టారు. ఈ పక్రియతో పాప త్వరగా కోలుకుంది. మరో రెండ్రోజుల్లో పాపను డిశ్చార్జ్ చేయనున్నారు.