child saved
-
పోలీసుల చొరవతో బయటపడ్డ బాలుడు
సాక్షి, విజయవాడ: పట్టణంలోని భవానీపురం లేబర్ కాలనీలో ఆరేళ్ల బాలుడు రెండు గోడల మధ్య ఇరుక్కుపోయిన ఘటన కుటుంబ సభ్యులను, స్థానికులను కలవరానికి గురిచేసింది. అయితే, భవానీపురం పోలీసుల చొరవతో బాలుడు క్షేమంగా బయటడపటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఊపిరి అందక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న బాలుడి విషయం తెలియగానే.. భవానీపురం ఎస్సై కవిత శ్రీ,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు, కానిస్టేబుల్ చలపతి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గోడలో ప్రమాదవశాత్తు ఇరుకు పోయిన బాలుడిని చాకచక్యంగా కాపాడారు. భవానీపురం పోలీసులు వేగంగా స్పందించడంతో బాలుడికి ప్రమాదం తప్పిందని స్థానికులు వెల్లడించారు. పోలీసుల సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురిపించారు. -
హైవే రోడ్డు.. ఒంటరిగా పరుగెడుతున్న చిన్నారి..!!
-
హైవే రోడ్డు.. ఒంటరిగా పరుగెడుతున్న చిన్నారి..!!
విస్కాన్సిన్ : ‘రోడ్డుపై వెళ్తున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి’ అనే మాటకు ఓ మహిళా డ్రైవర్ అసలైన అర్థం చెప్పారు. మానవత్వానికి కాస్త అమ్మతనాన్ని జోడించి ఓ పసిప్రాణాన్ని కాపాడారు. గడ్డకట్టుకుపోయే చలిలో కాళ్లకు చెప్పులు లేకుండా.. ఒంటికి సరిపడా బట్టలు లేకుండా నడిరోడ్డుపై పరుగెడుతున్న ఓ 19 నెలల చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. ఆ బస్ డ్రైవర్ రాక క్షణంకాలం ఆలస్యమైనా పాప ప్రాణాలకు ముప్పు వాటిల్లేదే. ఈ ఘటన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ పట్టణంలో గత డిసెంబరు 22న జరిగింది. ఆ రోజు ఉదయం మిల్వాకీ ట్రాన్సిట్ సంస్థకు చెందిన మహిళా డ్రైవర్ ఇరేనా ఇవిక్ డ్యూటీ నిమిత్తం బస్‌లో వెళ్తుండగా రోడ్డు డివైడర్‌పైన ఒంటరిగా పరుగెడుతున్న ఓ చిన్నారి కంటపడింది. గడ్డకట్టుకుపోయే చలిలో ఒంటరిగా ఉన్న ఆ చిన్నారిని చూసి ఆమె షాక్ తిన్నది. వెంటనే అప్రమత్తమై వాహనాన్ని పక్కకు నిలిపి పరుగెత్తుకుంటూ వెళ్లి ఇవిక్ ఆ చిన్నారిని బస్‌లోకి తీసుకొచ్చింది. ఇదంతా క్షణాల్లో జరగడంతో బస్‌లో ఉన్న ప్యాసెంజర్ అయోమయానికి గురయ్యారు. చలికి వణుకుపట్టి బిక్కుబిక్కుమంటూ తనవారి కోసం ఏడుస్తున్న ఆ చిన్నారి ఒక స్వెటర్ వేసి.. తన ఒళ్లో కూర్చోబెట్టుకుంది ఇవిక్. ఇవిక్ అప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని పాపను తీసుకెళ్లారు. కాగా, చిన్నారి తల్లికి మానసిక రుగ్మత ఉన్నందునే పాప ఇంట్లోనుంచి రోడ్డుపైకి చేరిందని అధికారులు తెలిపారు. పాపను ఆమె తండ్రికి అప్పగించారు. అప్రమత్తంగా వ్యవహరించి చిన్నారిని కాపాడిన ఇవిక్కు గురువారం సన్మానం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘సరైన సమయనికి అక్కడున్నా. లేదంటే చిన్నారికి పెద్ద ప్రమాదమే జరిగేది. దేవుడి దయవల్ల ఈ చిన్నారిని కాపాడగలిగా’ అని చెప్పుకొచ్చారు ఇవిక్. కాగా, గత కొన్ని నెలల కాలంలో మొత్తం 9 మంది పిల్లల్ని తమ బస్ డ్రైవర్లు స్పందించి కాపాడారని మిల్వాకీ కౌంటీ ట్రాన్సిట్ సిస్టమ్ అధికార ప్రతినిధి మాట్ సిల్కర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ట్రాన్సిట్ సంస్థ విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. -
4వ అంతస్తు నుంచి కిందపడ్డ చిన్నారి..
ప్రాణం పోయే పరిస్థితుల్లో నుంచి బయటపడితే ఏమంటాం.. అద్భుతమే జరిగింది. భూమ్మీద నూకలు బాకీ ఉన్నాయి అంటాం. చిన్న పిల్లల విషయంలోనైతే చిరంజీవి అంటాం. ముంబైకి చెందిన అధర్వాను ఇప్పుడందరూ చిరంజీవి అని పిలుచుకుంటున్నారు. పిల్లాడికి తిరిగి జీవితాన్ని ప్రసాదించిన ఆ చెట్టును సంజీవని అంటున్నారు. సాక్షి, ముంబై : నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డ 14 నెలల అధర్వా బర్కాడే అలియాస్ శ్రీ అనే బాలుడికి ఓ చెట్టు పునర్జన్మనిచ్చింది. చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేలా చేసింది. వివరాలు.. అధర్వా అలియాస్ శ్రీ కుటుంబం గోవంధిలోని దేవాశి రోడ్డులో గల గోపికృష్ణన్ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. గురువారం ఉదయం శ్రీ నానమ్మ ఫ్రెంచ్ కిటీకీ తెరచి బట్టలు ఆరబెట్టింది.కానీ, హడావుడిలో గడియ సరిగా పెట్టలేదు. కొత్త భవనం కావడంతో దానికి గ్రిల్స్ బిగించలేదు. అదే గదిలో ఆడుకుంటున్న శ్రీ కిటికీ వద్దకు చేరుకున్నాడు. రక్షణగా ఉన్న రెండు ఫీట్ల ఎత్తున్న తేలికపాటి చెక్కను తొలగించడంతో ఆ ఫ్రెంచ్ కిటికీ నుంచి నుంచి కిందపడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. పరుగు పరుగున కిందకి చేరుకున్నారు. అయితే, శ్రీ కుటుంబం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను ఆనుకుని ఓ చెట్టు ఉండడంతో.. పిల్లాడు నేరుగా కిందపడలేదు. ఆ చెట్టు కొమ్మలపై పడి నేలను చేరడంతో తీవ్ర గాయాలు కాలేదు. తమ కుమారుడికి ఏమైందోనని తల్లిదండ్రులు అజిత్, జ్యోతి వచ్చి భోరున విలపించారు. బాలుడు స్పృహలోనే ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శ్రీకి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. పెదవి, కాలికి గాయాలయ్యాయని తెలిపారు. చెట్టుపై పడడంతోనే పిల్లాడికి పెద్దగా గాయాలు కాలేదని అన్నారు. కాగా, బాలుడి తండ్రి చెట్ల పెంపకానికి వినియోగించే ఎరువులు, మట్టి, పేడ వ్యాపారం చేస్తుండడం విశేషం. పిల్లాడి ప్రాణాలు కాపాడిన ఆ చెట్టుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. -
ఆదమరిచి.. పాప ప్రాణాల మీదకి తెచ్చారు..!
సాక్షి, ముంబై : స్మార్ట్ ఫోన్ కాలం మొదలయ్యాక పక్కనున్న మనిషిని సైతం పట్టించుకునే తీరిక లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జనాలు సమాజంలో మాత్రం అలా ఉండలేక పోతున్నారు. అందర్నీ ఆదమరచి నెట్ ప్రపంచంతో దోస్తీ కడుతున్నారు. చంటి పాపల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండకపోతే కొన్నిసార్లు పరిస్థితి చేజారుతుంది. ముంబైలోని కుర్లాలో గతవారం చోటుచేసుకున్న ఓ ఘటన పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండొద్దనడానికి మంచి ఉదాహరణ. వివరాలు.. ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది పాప కుషీ సోనీ ప్రమాదవశాత్తు చెవిపోగు మింగేసింది. అయితే, స్మార్ట్ఫోన్లతో బిజీగా ఉండి ఇంట్లోవాళ్లు ఇది గమనించకపోవడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయింది. గొంతులో చెవిపోగు ఉండిపోవడంతో పాపకు ఇన్ఫెక్షన్తో దగ్గు, జ్వరం మొదలైంది. అంతా సాధారణ జ్వరమేనని భావించారు. జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ నయం కావడానికి మందులు వాడారు. కానీ, పాప ఆరోగ్యం కుదుటపడక పోగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.దాంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారి సోనీని లోకమాన్య తిలక్ మున్సిపల్ హాస్పిటల్‌కు తరలించారు.గొంతులో ఏదైనా అడ్డుపడొచ్చని భావించి ఎక్స్‌రే తీశారు. కానీ, లాభం లేకపోయింది. ఎక్స్‌రేలో అంతా బాగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. రెండుమూడు రోజుల్లో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన తమ బిడ్డ దక్కుతుందో లేదోనని ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సోనీని అక్కడి నుంచి బీజే వాడియా ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరోసారి అక్కడ ఎక్స్‌రే తీయడంతో పాప గొంతులో చెవిపోగు ఉందని వైద్యులు నిర్ధారించారు. వైద్యులు దాదాపు 30 నిమిషాలపాటు శ్రమించి ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండానే పాప గొంతులో ఇరుక్కున్న రెండంగుళాల చెవిపోగును తొలగించారు. వైద్యుల కృషితో ప్రాణాలతో భయటపడిన సోనీ ఆసుపత్రిలోనే గురువారం తన మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. -
శభాష్ చందన
సాక్షి, కర్ణాటక ,మండ్య : ఆ చిన్నారి సమయస్పూర్తి ఒకరి నిండు ప్రాణం కాపాడింది. దుకాణానికి వెళ్లిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు నీటికుంటలో పడిపోవడంతో సకాలంలో స్పందించిన మరో చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రీతూ, చందన ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరికి ఏడేళ్లు లోపు ఉంటాయి. ఒకే ప్రాంతంలో ఉండటమే కాకుండా ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసే వెళ్తారు. అతి చిన్న వయసులోనే ఆ స్నేహబంధం వీరి మధ్య పెనవేసుకుంది. మండ్య జిల్లా భారతీ నగర సమీపంలోని అణ్ణూరుకు చెందిన చంద్రశేఖర్, వినూత దంపతుల కుమార్తె రీతు, అజిత్ కుమార్, చందన దంపతులు కుమార్తె చందన కుటుంబాలు కూడా మంచి స్నేహితులు. ఇదిలా ఉంటే ఈనెల 10న ఈ ఇద్దరు చిన్నారులు తినుబండారాలు కొనుక్కోవడానికి దుకాణం వద్దకు వెళ్లారు. రీతు చెప్పుకు పేడ అంటింది. దారి సమీపంలో ఉన్న నీటి కుంటలోకి దిగి పేడను కడుక్కోవడానికి దిగారు. ఇదే సమయంలో రీతు నీటిలో పడిపోయింది. దాదాపు 8 అడుగుల లోతు ఉంది. రీతును బయటకు లాగడానికి చందన ప్రయత్నించింది. అయితే తన వల్ల కాకపోవడంతో ఇంటికి పరుగు పెట్టి రీతు తండ్రికి విషయం వివరించడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని రీతును బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆదివారానికి బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆ ఇంట నవ్వులు పూశాయి. చందన ఆలస్యం చేసి ఉంటే తమ బిడ్డ బతికే అవకాశం లేదని రీతు తండ్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చందనను అభినందించారు. -
స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి.. ఏం చేశాడంటే..
-
స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి.. ఏం చేశాడంటే
రెండేళ్ల వయసున్న ఓ పిల్లాడు చైనాలోని లియావోచెంగ్ నగరంలో ఓ అపార్టుమెంటు మూడో అంతస్తు బయట కిటికీ తలుపునకు వేలాడుతున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆడుకుంటూ బయటకు వచ్చి.. ఎలా ఇరుక్కున్నాడో తెలియదు గానీ, కిటికీ బయటకు వచ్చి వేళ్లాడుతూ ఉన్నాడు. అతడి చొక్కా ఒక తలుపు హుక్ వద్ద ఇరుక్కోవడంతో అతడు అక్కడ ఆగిపోయాడు. పిల్లాడు అలా వేలాడుతుండటం చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని.. అక్కడకు సమీపంలోనే ఉండే లియాంగ్ అనే వ్యక్తి వచ్చి చూశాడు. పిల్లాడిని ఆ పరిస్థితిలో చూసి ఒక్క క్షణం కూడా ఆగకుండా చకచకా స్పైడర్ మ్యాన్‌లాగే కిటికీలు పట్టుకుని పైకి ఎక్కి, ఆ పిల్లాడిని ఒక చేత్తోను, కిటికీ ఊచలను మరో చేత్తోను గట్టిగా పట్టుకున్నాడు. కాసేపటి తర్వాత ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది వచ్చి.. కింద ఉయ్యాల లాంటిది ఏర్పాటు చేశారు. పొరపాటున లియాంగ్, పిల్లాడు కింద పడినా వాళ్లకు దెబ్బ తగలకూడదని అలా చేశారు. కానీ ఈలోపు తాళాల కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి వచ్చి.. మూడో అంతస్తులో పిల్లాడు ఉన్న అపార్టుమెంటు తాళాన్ని తెరిచాడు. దాంతో కిటికీ గుండానే లియాంగ్, ఆ పిల్లాడు గదిలోకి వెళ్లిపోయారు. పిల్లవాడి మెడ మీద కిటికీ ఊచల మచ్చలు ఉన్నాయని, అతడు ఏమాత్రం మెడ తిప్పి ఉన్నా కిందకు పడిపోయి ఉండేవాడని లియాంగ్ చెప్పాడు. భయంతో అతడి కాళ్లు వణికిపోతుండటాన్ని తాను కింది నుంచి చూశానని, దాంతో తాను ఎక్కగలనో లేదో అని ఆలోచించకుండా పైకి ఎక్కేశానని వివరించాడు. ఈ మొత్తం దృశ్యాన్ని పొరుగునుండే మరో వ్యక్తి తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. చాలాసేపటి తర్వాత వచ్చిన పిల్లవాడి తల్లిదండ్రులు జరిగిన విషయం మొత్తం తెలుసుకుని... లియాంగ్ ధైర్యసాహసాలు, తమ కొడుకును రక్షించిన వైనానికి అతడికి కృతజ్ఞతలు తెలిపారు.