ప్రాణాలతో బయటపడిన సోనీ.. ఇన్‌సెట్లో చెవిపోగు
సాక్షి, ముంబై : స్మార్ట్ ఫోన్ కాలం మొదలయ్యాక పక్కనున్న మనిషిని సైతం పట్టించుకునే తీరిక లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జనాలు సమాజంలో మాత్రం అలా ఉండలేక పోతున్నారు. అందర్నీ ఆదమరచి నెట్ ప్రపంచంతో దోస్తీ కడుతున్నారు. చంటి పాపల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండకపోతే కొన్నిసార్లు పరిస్థితి చేజారుతుంది. ముంబైలోని కుర్లాలో గతవారం చోటుచేసుకున్న ఓ ఘటన పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండొద్దనడానికి మంచి ఉదాహరణ.
వివరాలు.. ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది పాప కుషీ సోనీ ప్రమాదవశాత్తు చెవిపోగు మింగేసింది. అయితే, స్మార్ట్‌ఫోన్లతో బిజీగా ఉండి ఇంట్లోవాళ్లు ఇది గమనించకపోవడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయింది. గొంతులో చెవిపోగు ఉండిపోవడంతో పాపకు ఇన్‌ఫెక్షన్‌తో దగ్గు, జ్వరం మొదలైంది. అంతా సాధారణ జ్వరమేనని భావించారు. జ్వరం, గొంతులో ఇన్‌ఫెక్షన్ నయం కావడానికి మందులు వాడారు. కానీ, పాప ఆరోగ్యం కుదుటపడక పోగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.దాంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారి సోనీని లోకమాన్య తిలక్ మున్సిపల్ హాస్పిటల్‌కు తరలించారు.గొంతులో ఏదైనా అడ్డుపడొచ్చని భావించి ఎక్స్‌రే తీశారు. కానీ, లాభం లేకపోయింది. ఎక్స్‌రేలో అంతా బాగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి.
రెండుమూడు రోజుల్లో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన తమ బిడ్డ దక్కుతుందో లేదోనని ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సోనీని అక్కడి నుంచి బీజే వాడియా ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరోసారి అక్కడ ఎక్స్‌రే తీయడంతో పాప గొంతులో చెవిపోగు ఉందని వైద్యులు నిర్ధారించారు. వైద్యులు దాదాపు 30 నిమిషాలపాటు శ్రమించి ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండానే పాప గొంతులో ఇరుక్కున్న రెండంగుళాల చెవిపోగును తొలగించారు. వైద్యుల కృషితో ప్రాణాలతో భయటపడిన సోనీ ఆసుపత్రిలోనే గురువారం తన మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది.
Comments
Please login to add a commentAdd a comment