నీటిలో కుంటలో పడిన రీతూ,సకాలంలో స్పందించిన చందన
సాక్షి, కర్ణాటక ,మండ్య : ఆ చిన్నారి సమయస్పూర్తి ఒకరి నిండు ప్రాణం కాపాడింది. దుకాణానికి వెళ్లిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు నీటికుంటలో పడిపోవడంతో సకాలంలో స్పందించిన మరో చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రీతూ, చందన ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరికి ఏడేళ్లు లోపు ఉంటాయి. ఒకే ప్రాంతంలో ఉండటమే కాకుండా ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసే వెళ్తారు. అతి చిన్న వయసులోనే ఆ స్నేహబంధం వీరి మధ్య పెనవేసుకుంది. మండ్య జిల్లా భారతీ నగర సమీపంలోని అణ్ణూరుకు చెందిన చంద్రశేఖర్, వినూత దంపతుల కుమార్తె రీతు, అజిత్ కుమార్, చందన దంపతులు కుమార్తె చందన కుటుంబాలు కూడా మంచి స్నేహితులు.
ఇదిలా ఉంటే ఈనెల 10న ఈ ఇద్దరు చిన్నారులు తినుబండారాలు కొనుక్కోవడానికి దుకాణం వద్దకు వెళ్లారు. రీతు చెప్పుకు పేడ అంటింది. దారి సమీపంలో ఉన్న నీటి కుంటలోకి దిగి పేడను కడుక్కోవడానికి దిగారు. ఇదే సమయంలో రీతు నీటిలో పడిపోయింది. దాదాపు 8 అడుగుల లోతు ఉంది. రీతును బయటకు లాగడానికి చందన ప్రయత్నించింది. అయితే తన వల్ల కాకపోవడంతో ఇంటికి పరుగు పెట్టి రీతు తండ్రికి విషయం వివరించడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని రీతును బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆదివారానికి బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆ ఇంట నవ్వులు పూశాయి. చందన ఆలస్యం చేసి ఉంటే తమ బిడ్డ బతికే అవకాశం లేదని రీతు తండ్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చందనను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment