స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి.. ఏం చేశాడంటే
స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి.. ఏం చేశాడంటే
Published Mon, Oct 31 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
రెండేళ్ల వయసున్న ఓ పిల్లాడు చైనాలోని లియావోచెంగ్ నగరంలో ఓ అపార్టుమెంటు మూడో అంతస్తు బయట కిటికీ తలుపునకు వేలాడుతున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆడుకుంటూ బయటకు వచ్చి.. ఎలా ఇరుక్కున్నాడో తెలియదు గానీ, కిటికీ బయటకు వచ్చి వేళ్లాడుతూ ఉన్నాడు. అతడి చొక్కా ఒక తలుపు హుక్ వద్ద ఇరుక్కోవడంతో అతడు అక్కడ ఆగిపోయాడు. పిల్లాడు అలా వేలాడుతుండటం చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని.. అక్కడకు సమీపంలోనే ఉండే లియాంగ్ అనే వ్యక్తి వచ్చి చూశాడు. పిల్లాడిని ఆ పరిస్థితిలో చూసి ఒక్క క్షణం కూడా ఆగకుండా చకచకా స్పైడర్ మ్యాన్‌లాగే కిటికీలు పట్టుకుని పైకి ఎక్కి, ఆ పిల్లాడిని ఒక చేత్తోను, కిటికీ ఊచలను మరో చేత్తోను గట్టిగా పట్టుకున్నాడు. కాసేపటి తర్వాత ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది వచ్చి.. కింద ఉయ్యాల లాంటిది ఏర్పాటు చేశారు.
పొరపాటున లియాంగ్, పిల్లాడు కింద పడినా వాళ్లకు దెబ్బ తగలకూడదని అలా చేశారు. కానీ ఈలోపు తాళాల కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి వచ్చి.. మూడో అంతస్తులో పిల్లాడు ఉన్న అపార్టుమెంటు తాళాన్ని తెరిచాడు. దాంతో కిటికీ గుండానే లియాంగ్, ఆ పిల్లాడు గదిలోకి వెళ్లిపోయారు. పిల్లవాడి మెడ మీద కిటికీ ఊచల మచ్చలు ఉన్నాయని, అతడు ఏమాత్రం మెడ తిప్పి ఉన్నా కిందకు పడిపోయి ఉండేవాడని లియాంగ్ చెప్పాడు. భయంతో అతడి కాళ్లు వణికిపోతుండటాన్ని తాను కింది నుంచి చూశానని, దాంతో తాను ఎక్కగలనో లేదో అని ఆలోచించకుండా పైకి ఎక్కేశానని వివరించాడు. ఈ మొత్తం దృశ్యాన్ని పొరుగునుండే మరో వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. చాలాసేపటి తర్వాత వచ్చిన పిల్లవాడి తల్లిదండ్రులు జరిగిన విషయం మొత్తం తెలుసుకుని... లియాంగ్ ధైర్యసాహసాలు, తమ కొడుకును రక్షించిన వైనానికి అతడికి కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement