అపార్ట్‌మెంట్ పైకి ఎక్కుతున్న పోలీసులు (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
న్యూఢిల్లీ: స్పైడర్‌మ్యాన్ సినిమాలు అంటే పిల్లలు, పెద్దలకు ఎంతో ఆసక్తి. పెద్ద పెద్ద భవంతులను సైతం అలవోకగా ఎక్కుతూ.. ప్రమాదాల నుంచి జనాలను కాపాడుతూ అందరి ప్రశంసలు పొందుతాడు స్పైడర్‌మ్యాన్. సినిమాలో అంటే ఏ వేషాలైన వేయగల్గుతాం. కానీ రియాలిటీలో మాత్రం ఇలా బిల్డింగ్‌ల మీదకు ఎక్కడం సాహసంగానే చెప్పవచ్చు. ఇలాంటి సాహసాన్ని నిజం చేసి చూపించాడు ఓ పోలీసు అధికారులు. ప్రస్తుతం అతడి సాహసానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రియల్ స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు..
దక్షిణ ఢిల్లీ గ్రేటర్ కైలాష్-1 ఏరియాలోని ఓ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో శుక్రవారం ఉదయం 6.55 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఇద్దరు పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్‌లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. ఇక బిల్డింగ్ లోపల ఉన్న వారిని బయటకు తరలించారు. కానీ ముగ్గురు మనుషులు లోపల చిక్కుకుపోయారు. వారు బయటికి రావడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. భయపడవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఇక వీరిలో ఓ అధికారి బిల్డింగ్ ఇనుప గ్రిల్ సాయంతో లోపలికి చేరుకున్నాడు. అక్కడ చిక్కుకుపోయిన వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చాడు. ఇలా కాపాడిన వారిలో 87 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు.
ప్రాణాలు తెగించి మరి జనాలను కాపాడిన ఆ పోలీసు అధికారి సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రియల్ స్పైడర్‌మ్యాన్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment