కోక్ కొందామని వస్తే.. తోసిపారేశారు!
పెద్ద పెద్ద పేర్లతో వస్తున్న బహుళ జాతీయ రెస్టారెంట్లు మన దేశంలో ఉన్న బడుగు జీవులను చిన్నచూపు చూస్తున్నాయి. ఈ విషయం మహారాష్ట్రలోని పుణె నగరంలో స్పష్టంగా రుజువైంది. అక్కడి మెక్ డోనాల్డ్ రెస్టారెంటు ఉద్యోగులు.. కోక్ కొనేందుకు వచ్చిన ఓ వీధి బాలుడిని మెడపట్టుకుని బయటకు గెంటేశారు. అలాంటివాళ్లకు తమ రెస్టారెంటులో చోటు లేదని స్పష్టం చేశారు. ఈ ఘోరంపై దర్యాప్తు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకోవాలని తాను ఇప్పటికే ఆదేశించానని, ప్రస్తుతం తనకు కూడా అన్ని విషయాలు తెలియవని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు.
ఈ మొత్తం విషయాన్ని షహీనా అత్తర్వాలా అనే మహిళ తన ఫేస్బుక్ పేజీలో వివరించారు. ఆమె తన స్నేహితులతో కలిసి మెక్ డోనాల్డ్ రెస్టారెంటుకు వెళ్లినప్పుడు అక్కడ బయట నిలబడి ఉన్న బాలుడిని చూశారు. వాళ్ల చేతుల్లో ఉన్న కోక్ టిన్నులను ఆశగా చూడటంతో.. నీక్కూడా కావాలా అని అడిగారు. అతడు అవుననడంతో షహీనా లోపలికెళ్తూ, తనతో పాటు లోపలికి వస్తావా అని ఆ పిల్లాడిని అడిగారు. దానికి అతడు సంతోషంగా అంగీకరించి లోపల క్యూలోకి వెళ్లగానే మెక్ డోనాల్డ్స్ ఉద్యోగులు అతడిని మెడపట్టి బయటకు గెంటేశారు. ఇలాంటి వాళ్లను అసలు లోపలకు అనుమతించేది లేదని కూడా ఓ ఉద్యోగి చెప్పారు. పిల్లాడి పక్కన తాను ఉండగానే అతడి కాలర్ పట్టుకుని మరీ బయటకు లాగి పారేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎలాంటి దర్యాప్తు జరిగినా తాము సహకరించేది లేదని మెక్ డోనాల్డ్స్ సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాము అంతర్గతంగా దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, అసలు తమ రెస్టారెంట్లలో వివక్షకు తావు ఇవ్వబోమని కూడా చెప్పింది.