అవును...ఇది పిల్లలు ఆడుకునే బ్యాంకు కాదు!
ఇది పిల్లల ఆట బ్యాంకు కాదు. వెలుగు బ్యాంకు.
దిక్కూ మొక్కూ లేని ఎందరో పిల్లల జీవితాలకు
భరోసా ఇచ్చి వారి కళ్లలో వెలుగు నింపే బ్యాంకు.
అక్కడ ఖాతాదారులతో పాటు...
ఉద్యోగులు కూడా పిల్లలే!
ఢిల్లీలో విజయవంతమై, ప్రపంచంలో పలు ప్రాంతాలకు విస్తరిస్తోన్న ‘ది చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఖజానా’ గురించి
తెలుసుకుందాం...
‘‘ఖజానా బ్యాంకు ఎక్కడండీ?’’
‘‘మీరు అడిగేది ఆ పిల్లల బ్యాంకు గురించేనా?’’
‘‘అవును’’
‘‘కాస్త ముందుకు వెళ్లి లెఫ్ట్‌కు తిరగండి. బోర్డ్ కనిపిస్తుంది’’
పాత ఢిల్లీలోని ఫతేపురిలో ఇలాంటి సంభాషణ తరచుగా వినిపిస్తుంటుంది. ఆ బ్యాంకుకు వచ్చే వాళ్లలో కస్టమర్లు మాత్రమే కాదు, ‘పిల్లల బ్యాంక్ అట!’ అని ఆశ్చర్యపడేవాళ్లు, పత్రికా ప్రతినిధులు, స్వచ్ఛందసేవకులు...ఎందరెందరో ఉంటారు. అందరూ ఒకే గొంతుతో అనేమాట: శభాష్!
ఆ పిల్లలు ధనికుల పిల్లలు కాదు. మధ్యతరగతి పిల్లలు కూడ కాదు. వీధిబాలలు. ఒక పూట తిండి ఉండి మరో పూట లేని అనాధలు. ‘‘ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన నేను ఒక టీ స్టాల్లో పనిచేసేవాడిని. కాని అక్కడి పరిస్థితులు మరీ దుర్భరంగా ఉండేవి. పని చేయాలనిపించేది కాదు. ఆ సమయంలోనే కొందరు వాలంటీర్లను కలిశాను. వాళ్లు ఈ బ్యాంకు గురించి చెప్పారు. అలా ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు స్కూలుకు వెళుతున్నాను. ఈ బ్యాంకుకు నేనే మేనేజర్‌ను కూడా’’ అని ఒకింత గర్వంగా చెబుతాడు సోను.
ఇక, పద్నాలుగు సంవత్సరాల ‘షేరు’కు రైల్వే ఫ్లాట్‌ఫామే ఇల్లూ వాకిలీ! ‘‘రైల్వేస్టేషన్లో వాటర్ బాటిళ్లు అమ్ముతుంటాను. ఈ బ్యాంకు గురించి తెలిసిన తరువాత డబ్బు పొదుపు చేస్తున్నాను. ఇప్పటివరకు ఆరు వేల రూపాయల వరకు పొదుపు చేశాను. భవిష్యత్తులో మరింత డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నాను’’ అంటున్నాడు షేరు.
ఫొటోగ్రాఫర్ కావాలనేది షేరు కల. ఏదో ఒకరోజు మాంచి కెమెరా ఒకటి కొనాలనేది అతని ఆలోచన.
కూలీ పనులు చేసే రహిమాకు కూడా ఈ బ్యాంకులో ఖాతా ఉంది. ‘‘నేను తరుచుగా డబ్బులు పోగొట్టుకునేదాన్ని. ఒకరోజు బట్టర్ఫ్లై స్వచ్ఛందసంస్థలో పని చేసే అక్కను కలిశాను. ఆమె చిల్డ్రన్స్ బ్యాంకు గురించి చెప్పింది. ఇక అప్పటి నుంచి ఈ బ్యాంకులో డబ్బులు పొదుపు చేస్తున్నాను. ఇప్పుడు నేను చాలా స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నాను. నా డబ్బులు భద్రంగా ఉన్నాయి అనే ఆలోచన సంతోషానికి గురిచేస్తోంది’’ అంటుంది రహిమా.
రహిమా మాటల్లో వినిపించిన ‘బట్టర్ఫ్లై’ స్వచ్ఛందసంస్థ వీధి పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. బ్యాంకు పెట్టాలనే ఆలోచన శశిధర్ షబ్నవీస్ బుర్రలో నుంచి పుట్టిందే. ఆయన ‘బట్టర్ఫ్లై’ చారిటీ ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనతో ఒక పిల్లాడు ఒకరోజు ఇలా అన్నాడు...‘‘రోజూ బాగానే సంపాదిస్తాను. తిండికి పోగా చాలా డబ్బులే మిగులుతాయి కూడా. కానీ ఎప్పుడూ డబ్బుల్ని పోగొట్టుకుంటుంటాను. ఒకవేళ నా జేబులో డబ్బు ఉంటే...అది ఖర్చు చేసేవరకు మనసు నెమ్మదించదు.’’
ఇది ఆ అబ్బాయి సమస్య మాత్రమే కాదనీ వీధిబాలలందరి సమస్య అనీ శశిధర్‌కు అర్థమైంది. ‘బట్టర్ఫై’్ల సభ్యులతో ఈ విషయం గురించి చర్చించాడు. అందరూ ఒక పరిష్కారానికి వచ్చారు. అదే...పిల్లల బ్యాంక్! పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏర్పాటయిన ‘ది చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఖజానా’ విజయవంతమవడమే కాదు ప్రపంచంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తోంది.
ఆగిపోయిన చదువును కొనసాగించడానికి, వృత్తి విద్యలను నేర్చుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకులో పొదుపు చేసిన డబ్బు పిల్లలకు ఉపయోగపడుతుంది.
ఢిల్లీలో ‘ఖజానా’ శాఖలు మొత్తం పన్నెండు ఉన్నాయి. తొమ్మిది నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న వెయ్యిమంది పిల్లలు ఈ బ్యాంకులలో ఖాతాదారులు. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఖాతాదారులు తమ గ్రూప్ నుంచి ఇద్దరు మేనేజర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అడుక్కునే పిల్లలు, డ్రగ్స్ అమ్మే పిల్లలకు ఈ బ్యాంకులలో సభ్యత్వం ఇవ్వరు. కష్టాన్ని నమ్ముకునే పిల్లల కోసం మాత్రమే ‘ఖజానా’ బ్యాంకు.
ఎవరైనా వచ్చి ‘‘నా డబ్బు తీసుకోవాలనుకుంటున్నాను’’ అని అడిగితే ఉన్నపళంగా ఇవ్వకుండా కారణం ఏమిటో తెలుసుకుంటారు. తోటి సభ్యులను సంప్రదించిన తరువాతే వారి ఆమోదంతోనే డబ్బు ఇస్తారు.
‘‘బ్యాంకులో డబ్బును దాచుకోవడం ద్వారా పొదుపు విలువను పిల్లలు తెలుసుకోగలుగుతున్నారు. దాచుకున్న డబ్బంతా తమ భవిష్యత్తుకు సోపానంగా ఉపయోగపడుతుందనే ఎరుక వారిలో వచ్చింది’’ అంటున్నాడు స్వచ్ఛందసేవకుడు ఆనంద్. ఈ ‘ఖజానా’ బ్యాంకు ఎంత విజయవంతమయిందంటే, ఢిల్లీలో మరిన్ని ప్రాంతాలలో శాఖలు ఏర్పాటు చేయాలనే అభ్యర్థనలు అందుతున్నాయి. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతలలో కూడా చిల్డ్రన్స్బ్యాంకులను ఏర్పాటు చేసే పనిలో ఉంది బట్టర్ఫ్లై. ‘ఖజానా’ బ్యాంకు పిల్లలకు ఏమిచ్చింది? అంటే ఒక్కమాటలో పొడిగా ముగించడం కష్టం.
జీవననైపుణ్యం, ఆర్థికనైపుణ్యాలతో పాటు... వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ‘ఖజానా’ బ్యాంకు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
‘ఖజానా’ బ్యాంకు పిల్లలకు ఏమిచ్చింది? అంటే ఒక్కమాటలో పొడిగా ముగించడం కష్టం. జీవన నైపుణ్యం, ఆర్థిక నైపుణ్యాలతో పాటు... వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ‘ఖజానా’ బ్యాంకు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.