వరిలో అగ్గి తెగులు
దుగ్గొండి : ఖరీఫ్ సీజన్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. నారు పోసుకున్నా నీటి వనరులు అందుబాటులో ఉన్న రైతులు మాత్రమే వరి పంటను సాగు చేసుకున్నారు. ప్రస్తుతం చిరు పొట్టదశలో ఉన్న పంటకు అక్కడక్కడా అగ్గి తెగులు కనిపిస్తోంది. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే పంటకు తీవ్ర నష్టం వస్తుందని మండల వ్యవసాయ అధికారి చిలువేరు దయాకర్(88866 14612) చెప్పారు. వరి పంటలో అగ్గి తెగులు రెండు రకాలుగా వస్తుంది. ఆకుల మీద వస్తే అగ్గి తెగులు, వెన్నుపై వస్తే మెడవిరుపు తెగులు అని అంటారు. ఈ సందర్భంగా తెగులు లక్షణాలు-నివారణ చర్యలను ఆయన వివరించారు.
అగ్గి తెగులు-లక్షణాలు
మొదట ఆకులపై నూలు కండె ఆకారంలో మచ్చలు వస్తాయి. అవి మధ్యలో ఉబ్బుగా చివరలో సన్నగా ఉంటాయి. మధ్యలోని మచ్చ తెల్లగా ఉంటుంది. ఆకులపై ఏర్పడిన మచ్చలు క్రమంగా పెద్దవిగా మారి ఆకు అంతా ఎండిపోతుంది. గాలి ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపించే ఈ తెగులు వల్ల తాలు గింజలు ఏర్పడి పంట దిగుబడి తగ్గుతుంది.
నివారణ చర్యలు
అగ్గి తెగులు మొదట పొలం గట్లపై ఉన్న గడ్డిపై వస్తుంది. తెగులు ఆనవాలు కనిపించినప్పుడు నత్రజని వాడకాన్ని తాత్కాలికంగా ఆపివేయాలి. తెగులు సోకిన తర్వాత మొదట జీవనియంత్రణ పద్ధతిలో సుడామోనాస్ లీటరు నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. చివరి అస్త్రంగా లీటరు నీటికి 0.7 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. అగ్గి తెగులు ప్రధానంగా విత్తనశుద్ధి చేయకుండా నాటడం వల్ల వస్తుంది.
మెడవిరుపు-నివారణ
మెడవిరుపు తెగులు వెన్ను మొదటి భాగంలో నల్లని మచ్చలు ఏర్పడి వరి కంకి వెన్ను విరుగుతుంది. దీని వల్ల గింజలన్నీ తాలుగా మారుతాయి. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల ప్రొఫేనోపాస్తో పాటు గ్రాము కార్బండైజమ్ కలిపి పిచికారీ చేస్తే మెడవిరుపు నుంచి పంటను రక్షించుకోవచ్చు. ఈ తెగులు సోకితే నివారణకు లీటరు నీటికి 0.7 గ్రాముల ట్రైసైక్లోజోల్ కలిపి పిచికారీ చేయాలి.