chini
-
చీనీ నర్సరీలతో అధిక లాభాలు
లింగాల: మండలంలో చీనీ నర్సరీలు విస్తారంగా సాగవుతున్నాయి. మండలంలోని లింగాల, పెద్దకుడాల, బోనాల, కర్ణపాపాయపల్లె, వెలిదండ్ల గ్రామాల్లోని రైతులు చీనీ నర్సరీలు విస్తారంగా సాగు చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి చీనీ నర్సరీలవల్ల లాభాలు గడిస్తున్నారు. ఏపీ, తెలంగాణా ప్రాంతాల నుంచి చీనీ మొక్కల కోసం విరివిగా వస్తున్నందున వాటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో నర్సరీల సాగు కోసం మండల రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నారు. జంబోరా నారుకు డిమాండ్ : చీనీ నర్సరీలు సాగు చేయాలంటే జంబోరా నారు అవసరం. ఈ నారును అన్నమయ్య జిల్లా రాజంపేటలోనే సాగు చేస్తారు. గత ఏడాది ఒక్కో జంబోరా మొక్క ఒక్క రూపాయి ఉండగా.. ప్రస్తుతం రూ.3లు పలుకుతోంది. గత ఏడాది భారీ వర్షాలవల్ల రాజంపేట ప్రాంతంలో జంబోరా విత్తనాలు మొలకెత్తకపోవడంతో అక్కడక్కడా ఉన్న జంబోరా నారుకు డిమాండ్ పెరిగిందని.. దీంతో ధరలు పెరిగాయని రైతులు అంటున్నారు. అదేవిధంగా తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలలో లభించే జంబోరా విత్తనాలు తగినన్ని లభించకపోవడం కూడా జంబోరా నారు ధరలు పెరగడానికి కారణమంటున్నారు. ఏడాది పాటు వేచి ఉండాలి.. జంబోరా నారు నాటినప్పటి నుంచి ఆరు మాసాలు జంబోరా మొక్కలు పెంచాలి. ఆ తర్వాత నాణ్యమైన చీనీ చెట్ల నుంచి కొమ్మలు వేరు చేసి వాటికి అంట్లు కట్టాలి. అంట్లు కట్టిన ఏడాదికి చీనీ మొక్కలు చేతికందుతాయి. కూలీలకు డిమాండ్ : జంబోరా మొక్కలు నాటడానికి, వాటికి అంట్లు కట్టడానికి నైపుణ్యం గల కూలీలనే ఆశ్రయించాలి. విస్తారంగా చీనీ నర్సరీలు సాగు అవుతున్నందున కూలీలకు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు కూలీ ధరలు కూడా బాగా పెరిగాయి. లాభాలు వస్తున్నాయి పెట్టుబడులు పెట్టినా చీనీ మొక్కలకు డిమాండ్ ఉన్నందున మంచి లాభాలు వస్తు న్నాయి. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు చీనీ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తే నర్సరీ రైతులకు కాస్తా ఊరట లభిస్తుంది. – కేశంరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (నర్సరీ రైతు), లింగాల లింగాల చీనీ మొక్కలకు డిమాండ్ లింగాల మండలంలో సాగు చేసిన చీనీ మొక్కలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ జంబోరా, రంగపూర్ మొక్కలు నాణ్యమైనవిగా పేరుగాంచింది. దీంతో ఏపీ, తెలంగాణా రైతులు వీటిపైనే మక్కువ చూపుతున్నారు. – ముచ్చుమర్రి చంద్రశేఖరరెడ్డి (చీనీ నర్సరీ రైతు), లింగాల -
కాయలు మిలమిల...లాభాలు ధగధగ
‘ఫ్రూట్ గ్రేడింగ్’తో అదనపు ఆదాయం మార్కెట్‌యార్డులో అందుబాటులో ఉన్న యూనిట్ చీనీ, కమలా రైతులకు ప్రయోజనం చీనీ కాయలైనా...కమలాలైనా చిన్నవి, పెద్దవి, మధ్యస్థంగా ఉన్నవి అన్నీ కలిపేసి విక్రయిస్తే రైతులకు వచ్చే లాభం తగ్గుతుంది. అదే వేటికవి వేరుచేసి విక్రయిస్తే వచ్చే రాబడి తప్పకుండా పెరుగుతుంది. ఇందుకోసం స్థానిక మార్కెట్‌యార్డులో ‘ఫ్రూట్ గ్రేడింగ్’ యూనిట్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యూనిట్ ద్వారా సహజపద్ధతుల్లోనే పండ్ల రంగును కూడా మెరుగుపరుచుకోవచ్చు. మార్కెట్లో కాయలు మెరిస్తే...రేటు ధగధగ లాడుతుందని నిపుణులు చెబుతున్నారు. అనంతపురం అగ్రికల్చర్: ‘ఫ్రూట్ గ్రేడింగ్’తో చీనీ, కమలాలు పండించే రైతులు అదనపు ఆదాయం లభిస్తుంది. వాస్తవంగా పంటనంతా కలిపి అమ్మితే మార్కెట్లో ఒకే ధర పలకడం జరుగుతుంది. దీని వల్ల రైతులు ఆదాయాన్ని కోల్పోతారు. అందువల్ల చిన్నవాటిని, పెద్ద వాటిని వేర్వేరుగా అమ్మితే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అలా చేయడమే గ్రేడింగ్ అంటారు. గ్రేడింగ్ చేయడం వల్ల పెద్దవాటికి మంచి ధర తప్పనిసరిగా వస్తుంది. దీనికి రైతు కొంత ఖర్చు చేసినా....అంతకు రెండు మూడు రెట్లు ఆదాయం ఉంటుంది. ఈ క్రమంలో పండ్లతోటల రైతులకు కొంతలో కొంత ఉపయోగపడేలా గ్రేడింగ్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. పండ్లతోటల సంక్షేమ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో గ్రేడింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. సంఘం సభ్యులైన ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాసచౌదరిలు మూలనబడిన మిషన్‌కు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చారు. రైతులు పండించిన చీనీకాయలకు అదనంగా ధర పలకాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన రైపనింగ్ ఛాంబర్లో ఇథలీన్గ్యాస్ ద్వారా రంగు (కలర్) మెరుగుపరచుకోవడంతో పాటు సైజుల వారీగా వ్యాక్సీ గ్రేడింగ్ చేసుకోవడం ద్వారా టన్నుపై రూ.5 వేల వరకు అదనంగా తీసుకోవచ్చని వారు చెబుతుూన్నారు. అయితే టన్నుకు రైతులు రూ.1,500 ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. అదనపు ఆదాయం సాధారణంగా టన్ను చీనీ మార్కెట్లో రూ.20 వేలు పలికితే... ఇలా గ్రేడింగ్ చేసినవి ఎంతలేదన్నా రూ.25 వేల వరకు పలుకుతాయని ఫ్రూట్ గ్రేడింగ్ నిర్వాహకులు తెలిపారు. అంటే పది టన్నులు అమ్మితే రూ.2 లక్షలకు బదులుగా రూ.2.50 లక్షల వరకు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఎక్కువగా చీనీకాయలు పండించే రైతులకు పెద్ద ఎత్తున లాభం వస్తుందనీ, కినో కమలాలకు అయితే మరింత ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలా మంది రైతులు పంట పండించడానికి ఎంతైనా కష్టపడతారు కానీ... మార్కెటింగ్ చేసుకోవడంలో ఆసక్తి చూపరనీ, దీనివల్ల వారు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల మార్కెటింగ్‌పై ఎంత దృష్టి పెడితే అంత లాభాలు గడించడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన బిగ్‌బాస్కెట్ కంపెనీతో అంగీకారం ఉన్నందున పెద్దగా లాభం ఆశించకుండా తామే రైతుల నుంచి చీనీకాయలు కొనుగోలు చేసి రైపనింగ్, గ్రేడింగ్ చేసి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఫ్రూట్ గ్రేడింగ్ యూనిట్ నిర్వాహకులు తెలిపారు. మార్కెట్‌యార్డులోని ‘ఫ్రూట్ గ్రేడింగ్’ యూనిట్‌కు రోజుకు 20 టన్నుల వరకు గ్రేడింగ్ చేసే సామర్థ్యం ఉందన్నారు. క్యాల్షియం కార్భైడ్‌తో కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇథలీన్, వ్యాక్స్ ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. చీనీకాయలతో పాటు కినో అనే కొత్తరకం కమలాకాయలు ఇక్కడ గ్రేడింగ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం తామే రైతుల నుంచి కొనుగోలు చేసి గ్రేడింగ్ యూనిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు ఒక్కసారి దీనికి అలవాటు పడితే గ్రేడింగ్ యూనిట్‌కు డిమాండ్ అధికంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఫ్రూట్ గ్రేడింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు 91609 27999, 94900 55366 నంబరల్లో సంప్రదించవచ్చు. మార్కెటింగ్ తరఫున ప్రోత్సాహం ఇటీవల మార్కెటింగ్‌శాఖ కమిషనర్ శ్యామూల్ ఆనంద్ గ్రేడింగ్ యూనిట్‌ను సందర్శించి మంచి ప్రయోగం చేస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. మార్కెటింగ్‌శాఖ తరఫున ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
టన్ను చీనీ రూ.16 వేలు
అనంతపురం అగ్రికల్చర్ : స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను సరాసరి ధర రూ.16 వేలు పలికింది. పండ్లమార్కెట్కు 360 టన్నుల చీనీకాయలు రాగా వేలంలో టన్ను గరిష్టంగా రూ.21 వేలు, కనిష్టంగా రూ.10 వేలు పలికింది. సరాసరి టన్ను ధర రూ.16 వేలుగా పలికినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. -
చీనీతోటల్లో వేరుకుళ్లు తెగుళ్లు
- జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోతారు – ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో చీనీ తోటల్లో వేరుకుళ్లు తెగుళ్లు ఆశించి నష్టం కలగజేస్తోందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. రానున్న మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశుసంపద పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన తెలియజేశారు. వాతావరణం రాగల మూడు రోజుల్లో ఆకాశం మేఘావృతమై 9 నుంచి 11 మి.మీ మేర తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీలు, రాత్రిళ్లు 25 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదుకావచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం 68 నుంచి 70, మధ్యాహ్నం 39 నుంచి 42 శాతం మధ్య ఉండవచ్చు. గంటకు 10 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంట సలహాలు + వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కాయలు అభివృద్ధి చెందుతున్న చీనీ తోటల్లో వేరుకుళ్లు ఆశించింది. నివారణకు 3 గ్రాములు రిడోమిల్–ఎంజెడ్ లీటర్ నీటికి కలిపి ఒక్కో చెట్టుకు 40 నుంచి 45 లీటర్లు పాదులు బాగా తడిచేలా పోయాలి. + కర్భూజాకు ఆశించిన తామర పురుగుల నివారణకు 2 మి.లీ పిప్రొనిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. + ఎండలు ఎక్కువగా ఉన్నందున అరటి పిలకలు నాటిన ప్రాంతాల్లో బెట్టకు గురికాకుండా ప్లాస్టిక్ మల్చింగ్ లేదా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. లేదంటే పిలకలు చనిపోయే ప్రమాదం ఉంది. + కాయలు అభివృద్ది చెందే మామిడితోటలు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. తేమ ఆవిరికాకుండా కలుపు మొక్కలు, ఎండిన ఆకులు, వేరుశనగ, వరి, రంపపు పొట్టు లాంటి వాటితో మల్చింగ్ చేసుకోవాలి. అలాగే 10 గ్రాములు పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. + ఖరీఫ్‌కు పంట సాగు చేసే రైతులు విత్తనం కోసం వాడే వేరుశనగ కాయలు పాడవకుండా జాగ్రత్తలు పాటించాలి. పాలిథిన్ లైనింగ్ ఉన్న గోనె సంచులలో వేసి ఒక వరుసలో 10 బస్తాలు పేర్చాలి. గాలి, వెలుతురు ప్రసరించేలా వరుసల మధ్య కొంచెం స్థలం వదలాలి. నేల మీద కాకుండా చెక్కపై మూటలు నిల్వ చేసుకుంటే మేలు. కాయలలో వేప ఆకులు లేదా వేప గింజల పొడిని కలిపి నిల్వ చేసుకుంటే పురుగుల ఉధృతి తగ్గుతుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే గదుల్లో నిల్వ చేస్తే మొలకశాతం బాగుంటుంది. పురుగులు పట్టినట్లు గమనిస్తే 5 మి.లీ మలాథియాన్ లేదా 1 మి.లీ డైక్లోరోవాస్ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లీటర్ నీటికి కలిపి సంచులు, నిల్వ చేసిన గదుల గోడలపై పిచికారీ చేసుకోవాలి. + వడదెబ్బ సోకే ప్రమాదం ఉన్నందున పశువులు, గొర్రెల సంరక్షణ చర్యలు చేపట్టాలి. మధ్యాహ్న సమయంలో బయటకు తీసుకెళ్లకూడదు. చెట్ల కింద లేదా పాకలు, వాతావరణం చల్లగా ఉండే ప్రాంతాల్లో కట్టివేసి ఉదయం, సాయంత్రం వేళల్లో మేత ఇవ్వాలి. సాధ్యమైనంత మేర నీటిని తాపడం, పశువులకు స్నానం చేయించాలి. అవకాశం ఉంటే పచ్చిమేత ఎక్కువగా ఇవ్వాలి. + కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపకం గదులపై డ్రిప్ ద్వారా నీటి తడులు లేదా పైన కొబ్బరిమట్టలు, బోదగడ్డి లాంటివి కప్పాలి. రోజంతా చల్లటి నీరు అందుబాటులో ఉంచాలి. ఉష్ణోగ్రత నియంత్రణకు ఫ్యాన్లు, కూలర్లు, ఫాగర్లు వాడాలి. అమ్మోనియా వాసన రాకుండా గాలి వెలుతురు బాగా ప్రసరించేలా చేసుకోవాలి. -
మంగుతో బెంగే..!
- చీనీలో సమగ్ర యాజమాన్యం తప్పనిసరి – ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు అనంతపురం అగ్రికల్చర్ : చీనీ కాయలకు మంగు ఉంటే మార్కెట్లో గిరాకీ ఉండదు. కాయలు పెద్దగా ఉన్నా కొనడానికి వ్యాపారస్తులు ఆసక్తి చూపించరు. చూపించినా తక్కువ ధరకే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రైతులకు నష్టం జరుగుతుందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. మంగు సోకకుండా చీనీ తోటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతుకు లాభం ఉంటుందని చెప్పారు. మంగు వ్యాప్తి ఇలా: చీనీ కాయలపై వక్క, ఊదా, ముదురు గోధుమ రంగులో ఏర్పడిన మచ్చలను మంగు అంటారు. మంగునల్లి ఆశించడం వల్లనే చీనీ బత్తాయి కాయలపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ నల్లులు కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. భూతద్ధం సాయంతో వీటిని చూడొచ్చు. పిల్లలు పసుపు రంగులోను, పెద్దనల్లులు ఆరంజి రంగులోను ఉంటాయి. పిల్ల, పెద్ద మంగునల్లులు పిందెల, కాయలపై పారాడుతూ తొక్కనుంచి రసంపీల్చి జీవిస్తాయి. రసాన్ని పీల్చే ప్రక్రియలో నల్లి నోటి నుండి రసాయనాల్ని వదులుతుంది. ఆ రసాయనం కాయతోలు నుంచి స్రవించిన ద్రవం, సూర్యరశ్మికి మార్పు చెంది తుప్పు లేదా వక్క రంగుకు మారుతుంది. బయటికి కనిపించే, సూర్యరశ్మి బాగా తగిలే కాయల్లో మంగు బాగా కనిపిస్తుంది. పిందెలకు నల్లి ఆశిస్తే రంగుకోల్పోయి మంగు ఏర్పడటం వల్ల కాయ అభివృద్ధి చెందదు. ఎదిగిన కాయల్ని ఆశిస్తే సైజు తగ్గదు కానీ మంగువచ్చి తోలు గట్టిపడి పెళుసుగా మారుతుంది. వేడి వాతావరణం, వర్షాభావ పరిస్థితులు నల్లి ఉనికి, ఉధృతికి బాగా దోహదపడ్తాయి. వర్షానికి పురుగులు చెట్ల నుండి జారి కిందపడి నశిస్తాయి. అందువలన జనవరిలో పూత పూసి ఆగష్టు– సెప్టెంబర్‌లో కోతకు వచ్చే అంగంసీజన్ (అంబెబహార్) కాయలపై నల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్‌లో పూత పూసి ఏప్రిల్–మే నెలల్లో కోతకొచ్చే గైరంగం (హస్తబహర్) సీజన్ కాయలకు, అలాగే జూన్‌లో పూత పూసి మార్చిలో కోత కొచ్చే ఎడగారు (మృగ్ బహార్) సీజన్ కాయలకు నల్లితాకిడి కాస్త తక్కువగానే ఉంటుంది. నివారణ : భూతద్దం సహాయంతో నల్లి ఉనికిపై నిఘాపెట్టి ఉంచాలి. ఒకటి రెండు నల్లులు తోటలో ఎక్కడైన పిందెలు, కాయలపై గమనించగానే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చెట్లలో కొమ్మలు కత్తిరింపు సక్రమంగా సకాలంలో చేసి చెట్టు లోపల గాలి వెలుతురు బాగా ప్రసరించేటట్లు చూడాలి. కత్తరింపులైన వెంటనే లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రా. కాపర్ హైడ్రాక్సైడ్ లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని ఒకమారు పిచికారి చేయాలి. ఈ రాగి ధాతు శిలీంద్రనాశిని కత్తిరించిన కొమ్మలకు రక్షణ ఇవ్వటమే కాకుండా నల్లి నివారణకు దోహదపడుతుంది. నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.