కాయలు మిలమిల...లాభాలు ధగధగ
‘ఫ్రూట్ గ్రేడింగ్’తో అదనపు ఆదాయం
మార్కెట్‌యార్డులో అందుబాటులో ఉన్న యూనిట్
చీనీ, కమలా రైతులకు ప్రయోజనం
చీనీ కాయలైనా...కమలాలైనా చిన్నవి, పెద్దవి, మధ్యస్థంగా ఉన్నవి అన్నీ కలిపేసి విక్రయిస్తే రైతులకు వచ్చే లాభం తగ్గుతుంది. అదే వేటికవి వేరుచేసి విక్రయిస్తే వచ్చే రాబడి తప్పకుండా పెరుగుతుంది. ఇందుకోసం స్థానిక మార్కెట్‌యార్డులో ‘ఫ్రూట్ గ్రేడింగ్’ యూనిట్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యూనిట్ ద్వారా సహజపద్ధతుల్లోనే పండ్ల రంగును కూడా మెరుగుపరుచుకోవచ్చు. మార్కెట్‌లో కాయలు మెరిస్తే...రేటు ధగధగ లాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అనంతపురం అగ్రికల్చర్: ‘ఫ్రూట్ గ్రేడింగ్’తో చీనీ, కమలాలు పండించే రైతులు అదనపు ఆదాయం లభిస్తుంది. వాస్తవంగా పంటనంతా కలిపి అమ్మితే మార్కెట్‌లో ఒకే ధర పలకడం జరుగుతుంది. దీని వల్ల రైతులు ఆదాయాన్ని కోల్పోతారు. అందువల్ల చిన్నవాటిని, పెద్ద వాటిని వేర్వేరుగా అమ్మితే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అలా చేయడమే గ్రేడింగ్ అంటారు. గ్రేడింగ్ చేయడం వల్ల పెద్దవాటికి మంచి ధర తప్పనిసరిగా వస్తుంది. దీనికి రైతు కొంత ఖర్చు చేసినా....అంతకు రెండు మూడు రెట్లు ఆదాయం ఉంటుంది. ఈ క్రమంలో పండ్లతోటల రైతులకు కొంతలో కొంత ఉపయోగపడేలా గ్రేడింగ్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.
పండ్లతోటల సంక్షేమ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో గ్రేడింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. సంఘం సభ్యులైన ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాసచౌదరిలు మూలనబడిన మిషన్‌కు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చారు. రైతులు పండించిన చీనీకాయలకు అదనంగా ధర పలకాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన రైపనింగ్ ఛాంబర్‌లో ఇథలీన్‌గ్యాస్ ద్వారా రంగు (కలర్) మెరుగుపరచుకోవడంతో పాటు సైజుల వారీగా వ్యాక్సీ గ్రేడింగ్ చేసుకోవడం ద్వారా టన్నుపై రూ.5 వేల వరకు అదనంగా తీసుకోవచ్చని వారు చెబుతుూన్నారు. అయితే టన్నుకు రైతులు రూ.1,500 ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు.
అదనపు ఆదాయం
సాధారణంగా టన్ను చీనీ మార్కెట్‌లో రూ.20 వేలు పలికితే... ఇలా గ్రేడింగ్ చేసినవి ఎంతలేదన్నా రూ.25 వేల వరకు పలుకుతాయని ఫ్రూట్ గ్రేడింగ్ నిర్వాహకులు తెలిపారు. అంటే పది టన్నులు అమ్మితే రూ.2 లక్షలకు బదులుగా రూ.2.50 లక్షల వరకు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఎక్కువగా చీనీకాయలు పండించే రైతులకు పెద్ద ఎత్తున లాభం వస్తుందనీ, కినో కమలాలకు అయితే మరింత ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలా మంది రైతులు పంట పండించడానికి ఎంతైనా కష్టపడతారు కానీ... మార్కెటింగ్ చేసుకోవడంలో ఆసక్తి చూపరనీ, దీనివల్ల వారు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
అందువల్ల మార్కెటింగ్‌పై ఎంత దృష్టి పెడితే అంత లాభాలు గడించడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన బిగ్‌బాస్కెట్ కంపెనీతో అంగీకారం ఉన్నందున పెద్దగా లాభం ఆశించకుండా తామే రైతుల నుంచి చీనీకాయలు కొనుగోలు చేసి రైపనింగ్, గ్రేడింగ్ చేసి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఫ్రూట్ గ్రేడింగ్ యూనిట్ నిర్వాహకులు తెలిపారు. మార్కెట్‌యార్డులోని ‘ఫ్రూట్ గ్రేడింగ్’ యూనిట్‌కు రోజుకు 20 టన్నుల వరకు గ్రేడింగ్ చేసే సామర్థ్యం ఉందన్నారు. క్యాల్షియం కార్భైడ్‌తో కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇథలీన్, వ్యాక్స్ ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. చీనీకాయలతో పాటు కినో అనే కొత్తరకం కమలాకాయలు ఇక్కడ గ్రేడింగ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం తామే రైతుల నుంచి కొనుగోలు చేసి గ్రేడింగ్ యూనిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు ఒక్కసారి దీనికి అలవాటు పడితే గ్రేడింగ్ యూనిట్‌కు డిమాండ్ అధికంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.
ఫ్రూట్ గ్రేడింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు
91609 27999, 94900 55366 నంబరల్లో సంప్రదించవచ్చు.
మార్కెటింగ్ తరఫున ప్రోత్సాహం
ఇటీవల మార్కెటింగ్‌శాఖ కమిషనర్ శ్యామూల్ ఆనంద్ గ్రేడింగ్ యూనిట్‌ను సందర్శించి మంచి ప్రయోగం చేస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. మార్కెటింగ్‌శాఖ తరఫున ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.