∙ మల్టీపర్పస్ మొబైల్ గ్రేడర్ యంత్రాన్ని అహ్మదాబాద్‌లో జాతీయ రైతు సమ్మేళనంలో ఇటీవల ప్రదర్శించిన రూపకర్తలు పీటర్, కిరణ్, దినేశ్
రైతులు ఆరుగాలం కష్టపడి, కరువును, తుపాన్లను, చీడపీడలను తట్టుకొని పండించి నూర్పిడి చేసిన తిండి గింజలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో చిన్న చిన్న రాళ్లు, మట్టిపెళ్లలు, ఇసుక వంటివి కలిసి ఉండటం వల్ల గిట్టుబాటు ధర పొందలేని దుస్థితి నెలకొంటున్నది. పండించిన ధాన్యాల్లో రాళ్లు, మట్టి పెళ్లలు, ఇసుక వంటివి కలవటం ఒక సమస్య అయితే.. ఒకే పొలంలో కలిపి పండించిన వివిధ రకాల ధాన్యాలు కలిసిపోవటం, వాటిని వేరు చేయడం చాలా శ్రమ, ఖర్చుతో కూడిన మరో సమస్య.
ముఖ్యంగా కొద్ది విస్తీర్ణంలో వివిధ ఏకదళ, ద్విదళ పంటలను కలిపి ఒకే పొలంలో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే చిన్న, సన్నకారు మెట్ట ప్రాంతాల రైతులకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెరగాలంటే ఈ సమస్యలను పొలం దగ్గరే సులభంగా పరిష్కరించుకునే తక్కువ ఖర్చుతో కూడిన మొబైల్ యంత్రం అవసరం ఉంది. ఈ అవసరాన్ని తీర్చేందుకు ముగ్గురు ఇంజనీర్లు ఏడాదిన్నరగా చేసిన కృషి ఫలించి.. ‘మల్టీపర్పస్ మొబైల్ గ్రేడింగ్ మిషన్’ సిద్ధమైంది.
ముగ్గురు మిత్రుల పరిశోధన..
పీటర్, దినే‹శ్, కిరణ్.. ఈ ముగ్గురూ మంచి మిత్రులు, ఇంజనీర్లు కూడా. పీటర్ ఆస్ట్రేలియాలో పుట్టారు. మెరైన్ ఇంజనీర్. పదేళ్లు ఓడల్లో ఉద్యోగాలు చేస్తూ దేశవిదేశాలు తిరిగారు. ఆ క్రమంలో వెన్నెముకకు దెబ్బ తగిలి.. పాండిచ్చేరిలో ఆశ్రమానికి చేరారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఇక్కడే స్థిరపడిపోయారు. 22 ఏళ్లుగా గ్రామీణ వ్యవసాయ సాంకేతికతలు, జీవనోపాధులపై పనిచేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా కదిరిలో ఉంటూ దినేష్‌తో కలిసి పనిచేస్తున్నారు. కర్ణాటకలో పుట్టిన దినేష్ ఇంజనీరింగ్ చదువుకుని కదిరిలో స్థిరపడి ఎర్త్ 360 సంస్థను స్థాపించారు. చిరుధాన్యాల సాగు, వినియోగం వ్యాప్తికి కృషి చేస్తున్నారు. తెలుగు వారైన విస్సా కిరణ్ మద్రాస్ ఐఐటీలో ఈసీఈలో ఇంజనీరింగ్ చదువుకుని అమెరికాలో కొన్నేళ్లు ఉద్యోగం చేసి తిరిగి స్వదేశంలో రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. దేశంలో 80 శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు బాసటగా నిలిచే పనులు చేయడం అన్నదే– ఈ ముగ్గురు మిత్రుల లక్ష్యం.
చిన్న, సన్నకారు రైతులు అప్పులు, ఆత్మహత్యల బారిన పడకుండా ఉండాలి. వీరు పచ్చగా ఉండాలంటే వాణిజ్య పంటల జోలికి వెళ్లకుండా వాతావరణ మార్పులను తట్టుకునే తమవైన స్థానిక ఆహార పంటలనే మిశ్రమ సేంద్రియ సాగు ద్వారా పండించుకుని తింటూ, మిగులు ఉత్పత్తులను మంచి ధరకు విక్రయించుకోగలగాలి. ఇది సాధ్యం కావాలంటే తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో రాళ్లు, ఇసుక, మట్టిపెడ్డలు, పుల్లలు లేకుండా శుద్ధమైన ధాన్యాలను రైతు ఇంటికి తెచ్చుకోవటం ముఖ్యం. అయితే, పొలం దగ్గరే గ్రేడింగ్ చేసే యంత్రాలు అందుబాటులో లేవు. పెద్ద మొబైల్ కంబైన్ హార్వెస్టర్లు ఉన్నా అవి పెద్ద కమతాలున్న పెద్ద రైతులకే అందుబాటులో ఉంటాయి. అందువల్ల తక్కువ ధరకే తమ ధాన్యాలను దళారులకు అమ్మేసుకోవడం తప్ప చిన్న రైతులకు వేరే దారి లేకుండా పోతోంది.
ఈ సమస్యను పరిష్కరించాలంటే పొలం దగ్గరకు సులువుగా తీసుకెళ్లి ఎన్ని రకాల ధాన్యాలనైనా రాళ్లు, ఇసుక తీసేసి, వేటికి వాటిని వేరు చేసిచ్చే గ్రేడింVŠ యంత్రాన్ని తామే తయారు చేయాలని వీరు నాలుగేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. ఏడాదిన్నర క్రితం పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. కదిరిలోనే ప్రయోగాలు చేపట్టి, ఎట్టకేలకు తాము ఆశించిన యంత్రాన్ని రూపొందించారు. 8 నెలల క్రితం నుంచి రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఈ యంత్రాన్ని మెరుగుపరిచి తుది రూపు ఇచ్చారు.
మొబైల్ గ్రేడర్ ప్రత్యేకతలు
ఈ యంత్రం రాళ్లు, ఇసుక, పుల్లలు, మట్టిపెళ్లలతోపాటు తాలు గింజలను కూడా వివిధ ధాన్యాల నుంచి సమర్థవంతంగా వేరు చేస్తుందని పీటర్, దినేశ్, కిరణ్ తెలిపారు. 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 80 కిలోల బరువు ఉంటుంది. దీనికి మొత్తం 3 జల్లెడలు అమర్చారు. 0.5 హెచ్.పి. మోటరుతో సింగిల్ ఫేజ్ ఎ.సి. కరెంటుతో.. అంటే, మారుమూల గ్రామాల్లో ఇళ్లకు ఉండే విద్యుత్‌తో కూడా నడుస్తుంది. గంటకు 10 క్వింటాళ్ల ధాన్యాలను గ్రేడ్ చేస్తుంది. రాళ్లు రప్పలు, ఇసుక, తాలను వేరు చేయడంతోపాటు.. కలిసిపోయిన రకరకాల ధాన్యాలను కూడా వేటికవి వేరు చేస్తుంది. దీనికి అడుగున ముందు వైపు రెండు టైర్లను అమర్చారు. ఎడ్లబండి లేదా ట్రాక్టరుకు కట్టి దీన్ని పొలాల దగ్గరకు తీసుకెళ్లి ఉపయోగించుకునేలా రూపొందించారు. సోలార్ విద్యుత్‌తో కూడా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. మిల్లెట్ మెషీన్స్ అండ్ టూల్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి.. రూ. 50 వేల ధరకు ఈ గ్రేడర్‌ను అనంతపురం జిల్లా కదిరిలో ఈ యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చారు.
వ్యవసాయ యంత్రాల పరీక్షణ, ధుృవీకరణ సంస్థల ద్వారా సర్టిఫికెట్ పొందటం ద్వారా ప్రభుత్వ సబ్సిడీపై చిన్న, సన్నకారు రైతులందరికీ ఈ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని దినేశ్ తెలిపారు. చిరుధాన్యాల పైపొట్టు తీసే డీహల్లర్ యంత్రాన్ని తక్కువ ధరలో రూపొందిస్తున్నామని, కొద్ది నెలల్లోనే రైతులకు అందిస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే మరికొన్ని వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. బహుళ ప్రయోజనకారి అయిన ఈ యంత్రం ఇటీవల వైబ్రంట్ గుజరాత్ టెక్నాలజీ సమ్మిట్– 2018లో వ్యవసాయ యంత్రాల విభాగంలో అవార్డును గెల్చుకున్నదని, ఒడిశా ప్రభుత్వం ఈ యంత్రంపై ఆసక్తి చూపిందన్నారు. ఈ నెల మొదటి వారంలో అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ రైతు సమ్మేళనంలో ఈ యంత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వివరాలకు.. దినేశ్ – 94408 70875.
milletmachinesandtools@gmail.com
Comments
Please login to add a commentAdd a comment