మంగుతో బెంగే..!
- చీనీలో సమగ్ర యాజమాన్యం తప్పనిసరి
– ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు
అనంతపురం అగ్రికల్చర్ : చీనీ కాయలకు మంగు ఉంటే మార్కెట్‌లో గిరాకీ ఉండదు. కాయలు పెద్దగా ఉన్నా కొనడానికి వ్యాపారస్తులు ఆసక్తి చూపించరు. చూపించినా తక్కువ ధరకే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రైతులకు నష్టం జరుగుతుందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. మంగు సోకకుండా చీనీ తోటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతుకు లాభం ఉంటుందని చెప్పారు.
మంగు వ్యాప్తి ఇలా: చీనీ కాయలపై వక్క, ఊదా, ముదురు గోధుమ రంగులో ఏర్పడిన మచ్చలను మంగు అంటారు. మంగునల్లి ఆశించడం వల్లనే చీనీ బత్తాయి కాయలపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ నల్లులు కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. భూతద్ధం సాయంతో వీటిని చూడొచ్చు. పిల్లలు పసుపు రంగులోను, పెద్దనల్లులు ఆరంజి రంగులోను ఉంటాయి. పిల్ల, పెద్ద మంగునల్లులు పిందెల, కాయలపై పారాడుతూ తొక్కనుంచి రసంపీల్చి జీవిస్తాయి. రసాన్ని పీల్చే ప్రక్రియలో నల్లి నోటి నుండి రసాయనాల్ని వదులుతుంది. ఆ రసాయనం కాయతోలు నుంచి స్రవించిన ద్రవం, సూర్యరశ్మికి మార్పు చెంది తుప్పు లేదా వక్క రంగుకు మారుతుంది.
బయటికి కనిపించే, సూర్యరశ్మి బాగా తగిలే కాయల్లో మంగు బాగా కనిపిస్తుంది. పిందెలకు నల్లి ఆశిస్తే రంగుకోల్పోయి మంగు ఏర్పడటం వల్ల కాయ అభివృద్ధి చెందదు. ఎదిగిన కాయల్ని ఆశిస్తే సైజు తగ్గదు కానీ మంగువచ్చి తోలు గట్టిపడి పెళుసుగా మారుతుంది. వేడి వాతావరణం, వర్షాభావ పరిస్థితులు నల్లి ఉనికి, ఉధృతికి బాగా దోహదపడ్తాయి. వర్షానికి పురుగులు చెట్ల నుండి జారి కిందపడి నశిస్తాయి. అందువలన జనవరిలో పూత పూసి ఆగష్టు– సెప్టెంబర్‌లో కోతకు వచ్చే అంగంసీజన్ (అంబెబహార్) కాయలపై నల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్‌లో పూత పూసి ఏప్రిల్–మే నెలల్లో కోతకొచ్చే గైరంగం (హస్తబహర్) సీజన్ కాయలకు, అలాగే జూన్‌లో పూత పూసి మార్చిలో కోత కొచ్చే ఎడగారు (మృగ్ బహార్) సీజన్ కాయలకు నల్లితాకిడి కాస్త తక్కువగానే ఉంటుంది.
నివారణ : భూతద్దం సహాయంతో నల్లి ఉనికిపై నిఘాపెట్టి ఉంచాలి. ఒకటి రెండు నల్లులు తోటలో ఎక్కడైన పిందెలు, కాయలపై గమనించగానే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చెట్లలో కొమ్మలు కత్తిరింపు సక్రమంగా సకాలంలో చేసి చెట్టు లోపల గాలి వెలుతురు బాగా ప్రసరించేటట్లు చూడాలి. కత్తరింపులైన వెంటనే లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రా. కాపర్ హైడ్రాక్సైడ్ లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని ఒకమారు పిచికారి చేయాలి. ఈ రాగి ధాతు శిలీంద్రనాశిని కత్తిరించిన కొమ్మలకు రక్షణ ఇవ్వటమే కాకుండా నల్లి నివారణకు దోహదపడుతుంది. నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.