చీనీతోటల్లో వేరుకుళ్లు తెగుళ్లు
- జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోతారు
– ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో చీనీ తోటల్లో వేరుకుళ్లు తెగుళ్లు ఆశించి నష్టం కలగజేస్తోందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. రానున్న మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశుసంపద పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన తెలియజేశారు.
వాతావరణం
రాగల మూడు రోజుల్లో ఆకాశం మేఘావృతమై 9 నుంచి 11 మి.మీ మేర తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీలు, రాత్రిళ్లు 25 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదుకావచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం 68 నుంచి 70, మధ్యాహ్నం 39 నుంచి 42 శాతం మధ్య ఉండవచ్చు. గంటకు 10 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
పంట సలహాలు
+ వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కాయలు అభివృద్ధి చెందుతున్న చీనీ తోటల్లో వేరుకుళ్లు ఆశించింది. నివారణకు 3 గ్రాములు రిడోమిల్–ఎంజెడ్ లీటర్ నీటికి కలిపి ఒక్కో చెట్టుకు 40 నుంచి 45 లీటర్లు పాదులు బాగా తడిచేలా పోయాలి.
+ కర్భూజాకు ఆశించిన తామర పురుగుల నివారణకు 2 మి.లీ పిప్రొనిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
+ ఎండలు ఎక్కువగా ఉన్నందున అరటి పిలకలు నాటిన ప్రాంతాల్లో బెట్టకు గురికాకుండా ప్లాస్టిక్ మల్చింగ్ లేదా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. లేదంటే పిలకలు చనిపోయే ప్రమాదం ఉంది.
+ కాయలు అభివృద్ది చెందే మామిడితోటలు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. తేమ ఆవిరికాకుండా కలుపు మొక్కలు, ఎండిన ఆకులు, వేరుశనగ, వరి, రంపపు పొట్టు లాంటి వాటితో మల్చింగ్ చేసుకోవాలి. అలాగే 10 గ్రాములు పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
+ ఖరీఫ్‌కు పంట సాగు చేసే రైతులు విత్తనం కోసం వాడే వేరుశనగ కాయలు పాడవకుండా జాగ్రత్తలు పాటించాలి. పాలిథిన్ లైనింగ్ ఉన్న గోనె సంచులలో వేసి ఒక వరుసలో 10 బస్తాలు పేర్చాలి. గాలి, వెలుతురు ప్రసరించేలా వరుసల మధ్య కొంచెం స్థలం వదలాలి. నేల మీద కాకుండా చెక్కపై మూటలు నిల్వ చేసుకుంటే మేలు. కాయలలో వేప ఆకులు లేదా వేప గింజల పొడిని కలిపి నిల్వ చేసుకుంటే పురుగుల ఉధృతి తగ్గుతుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే గదుల్లో నిల్వ చేస్తే మొలకశాతం బాగుంటుంది. పురుగులు పట్టినట్లు గమనిస్తే 5 మి.లీ మలాథియాన్ లేదా 1 మి.లీ డైక్లోరోవాస్ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లీటర్ నీటికి కలిపి సంచులు, నిల్వ చేసిన గదుల గోడలపై పిచికారీ చేసుకోవాలి.
+ వడదెబ్బ సోకే ప్రమాదం ఉన్నందున పశువులు, గొర్రెల సంరక్షణ చర్యలు చేపట్టాలి. మధ్యాహ్న సమయంలో బయటకు తీసుకెళ్లకూడదు. చెట్ల కింద లేదా పాకలు, వాతావరణం చల్లగా ఉండే ప్రాంతాల్లో కట్టివేసి ఉదయం, సాయంత్రం వేళల్లో మేత ఇవ్వాలి. సాధ్యమైనంత మేర నీటిని తాపడం, పశువులకు స్నానం చేయించాలి. అవకాశం ఉంటే పచ్చిమేత ఎక్కువగా ఇవ్వాలి.
+ కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపకం గదులపై డ్రిప్ ద్వారా నీటి తడులు లేదా పైన కొబ్బరిమట్టలు, బోదగడ్డి లాంటివి కప్పాలి. రోజంతా చల్లటి నీరు అందుబాటులో ఉంచాలి. ఉష్ణోగ్రత నియంత్రణకు ఫ్యాన్లు, కూలర్లు, ఫాగర్లు వాడాలి. అమ్మోనియా వాసన రాకుండా గాలి వెలుతురు బాగా ప్రసరించేలా చేసుకోవాలి.